ప్రీ–ప్రైమరీ వేతనాలకు  ట్రెజరీ బ్రేక్..4,131 ప్రీ–ప్రైమరీ స్కూళ్లలోని 8,262 మంది సిబ్బందికి జీతాల్లేవ్ 

ప్రీ–ప్రైమరీ వేతనాలకు  ట్రెజరీ బ్రేక్..4,131 ప్రీ–ప్రైమరీ స్కూళ్లలోని 8,262 మంది సిబ్బందికి జీతాల్లేవ్ 
  • బడ్జెట్ విడుదలైనా కంకరెన్స్, అకౌంట్ మెలికతో ట్రెజరీల్లో ఆగిన బిల్లులు 
  • ఎస్ఎన్ఏ -స్పర్శ్ మార్పుతో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు నిలిచిన చెల్లింపులు 
  • ఆర్థిక శాఖ ఆమోదం కోసం తాజాగా సర్కారుకు నవీన్ నికోలస్ లేఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు ప్రీ-ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల వేతనాల చెల్లింపుకు టెక్నికల్ సమస్య అడ్డంకిగా మారింది. ఈ చిక్కుముడిని విప్పేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. బడ్జెట్ విడుదలై డీడీఓలు బిల్లులు సమర్పించినప్పటికీ ఫైనాన్స్ కంకరెన్స్, హెడ్ ఆఫ్ అకౌంట్, ఎస్ఎన్ఏ-స్పర్శ్ మార్పు వంటి అడ్డంకులతో ట్రెజరీల్లో బిల్లులు నిలిచిపోయాయి.

తాజాగా ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ విద్యాశాఖ సెక్రటరీకి లేఖ రాశారు. దీనిలో ఆర్థిక శాఖ ఆమోదం కోసం మూడు స్పష్టమైన ప్రతిపాదనలు పంపారు. 

దశలవారీగా బడులు.. 

రాష్ట్రంలో దశలవారీగా 4,131 బడుల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 2023–24లో 306 స్కూళ్లు, 2024–25లో 266 స్కూళ్లు, 2025–26లో 790 రాష్ట్ర స్కూళ్లు ఉండగా.. 2026–27లో సీఎం ఆమోదంతో కొత్తగా 2,769 ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించారు.

వీటిలో పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8వేలు, ఆయాకు నెలకు రూ.6వేల చొప్పున 8,262 మందికి నెలకు రూ.5.78 కోట్లు అవసరం. 10 నెలల విద్యా సంవత్సరానికి రూ.57.83 కోట్లు అవసరం అవుతాయి. పీఏబీ ఆమోదించిన 572 స్కూళ్లకు కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో నిధులు భరిస్తుండగా, రూ.8 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 3,559 స్కూళ్లకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరిస్తూ 2026–27 బడ్జెట్‌లో రూ.49.29 కోట్లు కేటాయించింది.

బిల్లుల నిలిపివేతకు కారణాలివే..

తొలి విడతగా రూ.27.95 కోట్లకు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసి, డీఈఓలకు నిధులు కేటాయించడంతో డీడీఓలు బిల్లులు సమర్పించారు. అయితే పలు జిల్లాల్లో ట్రెజరీ అధికారులు మూడు కారణాలను చూపుతూ బిల్లులను అడ్మిట్ చేయడం లేదు. ప్రీ-ప్రైమరీ స్కూళ్లలోని 4,131 ఇన్‌స్ట్రక్టర్, 4,131 ఆయా పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కంకరెన్స్ లేకపోవడం మొదటి అడ్డంకిగా మారింది.

అలాగే ప్రస్తుతం కేటాయించిన హెడ్ ఆఫ్ అకౌంట్ సమస్య రావడంతో, దాని నుంచి నెలవారీ గౌరవ వేతనం ఇవ్వడం సరికాదని ట్రెజరీలు అభ్యంతరం చెబుతున్నాయి. దీనికి తోడు 2025–26 వరకు బిల్లులు పాస్ అయినా, 2026–27లో పేమెంట్ వ్యవస్థను ఎస్ఎన్ఏ నుంచి ‘ఎస్ఎన్ఏ- స్పర్శ్’ కు మారుస్తుండటంతో కూడా చెల్లింపులు ఆగిపోయాయి.

చిక్కుముడి వీడేందుకు ప్రపోజల్స్ ఇలా.. 

ఈ చిక్కుముడిని తొలగించి సిబ్బందికి సకాలంలో వేతనాలు అందించేందుకు ఆర్థిక శాఖతో మాట్లాడి మూడు అంశాలకు వెంటనే ఆమోదం ఇప్పించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్.. సర్కారును కోరారు. రాష్ట్రంలోని 4,131 ప్రీ-ప్రైమరీ స్కూళ్లలోని మొత్తం 8,262 పోస్టులకు ఫైనాన్స్ కంకరెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నెలవారీ గౌరవ వేతనాలను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ద్వారా చెల్లించేందుకు వీలుగా ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి కేటాయించాలని సూచించారు. కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్ కింద బిల్లులను ఆమోదించి ప్రాసెస్ చేసేలా సంబంధిత ట్రెజరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.