యాసంగికి 9.34 లక్షల క్వింటాళ్ల సీడ్స్..తెలంగాణలో 43.46 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

యాసంగికి 9.34 లక్షల క్వింటాళ్ల సీడ్స్..తెలంగాణలో 43.46 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా
  • అందుబాటులో 64,15,409 క్వింటాళ్ల విత్తనాలు
  • పంటల వారీగా విత్తన అవసరాలపై వ్యవసాయ శాఖ ప్రణాళిక 

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యవసాయ శాఖ విత్తన ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 43.46 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఇందుకు మొత్తం 9,34,438 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని ప్రతిపాదించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్తన నిల్వలు, పంటల వారీగా అవసరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ ప్రణాళిక రూపొందించింది.

 అవసరానికి మించి విత్తన నిల్వలు 

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 9,34,438 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ప్రస్తుతం వివిధ సంస్థలు, ప్రైవేటు కంపెనీల వద్ద కలిపి 64,15,409 క్వింటాళ్ల విత్తన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. 

ఇందులో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ) వద్ద 26,290 క్వింటాళ్లు, జాతీయ విత్తన సంస్థ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) వద్ద 24,035 క్వింటాళ్లు, ప్రైవేటు సంస్థల వద్ద 63,65,084 క్వింటాళ్ల నిల్వలు ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడించాయి.

మొక్కజొన్న విత్తనాలే 40 లక్షల క్వింటాళ్లకు పైన! 

వరి సాగును వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు కోసం 20,28,717 క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. యాసంగిలో అత్యధికంగా సాగయ్యే మొక్కజొన్నకు 40,41,638 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. సజ్జ విత్తనాలు 2,45,328 క్వింటాళ్లు, జొన్న విత్తనాలు 41,640 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయి. 

పప్పు శనగకు 79,600 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో వేరుశనగ విత్తనాల నిల్వలు 11,002 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి. మొత్తంగా యాసంగి సాగుకు అవసరమైన దానికంటే విత్తన నిల్వలు గణనీయంగా ఎక్కువగా ఉన్నప్పటికీ.. పంటల వారీగా రైతుల సాగు ప్రణాళికలు, అవసరాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీ  కీలకం కానుంది.

 యాసంగి పంటల సాగు అంచనా 

ప్రతిపాదిత యాసంగి సాగు విస్తీర్ణంలో 18.02 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయవచ్చని అంచనా వేయగా,  4,50,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని సీడ్​ ప్లాన్​లో పేర్కొన్నారు. మొక్కజొన్న 11.01 లక్షల ఎకరాల్లో సాగవుతుందని, 88,080 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని పేర్కొన్నారు. పప్పు శనగ 2.98 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.74 లక్షల ఎకరాలు, మినుములు 1.57 లక్షల ఎకరాలు, పెసర్లు 1.28 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని ప్రణాళికలో పొందుపరిచారు.