సిద్దిపేటపై ప్రధాన పార్టీల ఫోకస్! పోటా పోటీగా సభలు, సమావేశాలు, పాదయాత్రలు 

సిద్దిపేటపై ప్రధాన పార్టీల ఫోకస్!  పోటా పోటీగా సభలు, సమావేశాలు, పాదయాత్రలు 
  •  2029 అసెంబ్లీ ఎన్నికల వరకు 
  • పార్టీ బలం పెంచుకునే ప్రయత్నం  
  • రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు

మెదక్​/సిద్దిపేట రూరల్, వెలుగు :  సిద్దిపేట.. భారత రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్​) కంచుకోట. రెండు దశాబ్దాలుగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీనే విజయం సాధిస్తోంది.​ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సిద్దిపేట మున్సిపాలిటీ, నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీ, జడ్పీటీసీలు,  సర్పంచ్ ఎన్నికల్లో సైతం గులాబీ పార్టీ సత్తా చాటి జెండా ఎగురవేస్తోంది. తద్వారా నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి తనకు తిరుగు లేదని, ఏ పార్టీ పోటీ కాదని నిరూపిస్తోంది. దీంతో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీ తోపాటు, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్​) పార్టీలు సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 

జోరుగా సభలు.. సమావేశాలు.. 

  • అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉండగా బీఆర్ఎస్​ పార్టీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఆయా పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలు పెట్టాయి. ఈ మేరకు నియోజకవర్గంలో పార్టీల బలం పెంచుకునేందుకు, వివిధ వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు పోటా పోటీగా సభలు, సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నాయి.  
  •   సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదేండ్ల జిల్లా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్​రావు ఆధ్వర్యంలో సిద్దిపేట కేంద్రంగా ప్రత్యేక జిల్లా సాధించుకోవడంతోపాటు, జిల్లాలో ప్రత్యేకించి సిద్దిపేటలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి విస్తృత ప్రచారం నిర్వహించారు. 
  •      కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన  పార్టీ చీఫ్ కవిత సైతం సిద్దిపేట పై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. నియోజకవర్గంపై పట్టు సాధించే దిశగా కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా టీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షులుగా సీనియర్​ జర్నలిస్ట్​ లోక రవిచంద్రను నియమించడంతోపాటు, పట్టణంలో పార్టీ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కవిత బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్​ రావును లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సిద్దిపేటలో టీఆర్​ఎస్​ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. 
  •   హరీశ్​రావుకు, బీఆర్​ఎస్​ పార్టీకి గట్టిపట్టున్న సిద్దిపేట నియోజకవర్గంపై అధికార కాంగ్రెస్​ పార్టీ హైకమాండ్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఈ నియోజకవర్గంలో బలం పెంచుకోవడంలో భాగంగా గత కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తరచూ సిద్దిపేటలో పర్యటిస్తు పార్టీ క్యాడర్​ లో ఉత్సాహం నింపేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామి సైతం సిద్దిపేట నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పరంగా మంజూరైన కొత్త రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, చేయూత పెన్షన్​ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్​ పార్టీకి మద్దతు కూడగట్టాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.  నియోజకవర్గంలో బలం పెంచుకునే క్రమంలో కాంగ్రెస్​ పార్టీ ఈనెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి బహిరంగ సభ కూడా నిర్వహించింది.  ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభకు భారీగా జనసమీకరణ చేయడం ద్వారా ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసింది. సీఎం చేతుల మీదుగా రూ. 544 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం సిద్దిపేటకు రూ.200 కోట్లతో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్​ తోపాటు, నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్​ స్కూల్​ మంజూరు చేసింది. సిద్దిపేట గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీకి మాజీ మంత్రి అనంతుల మదన్​ మోహన్​ పేరు పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కోరడం, సీఎం హామీ ఇవ్వడం, ఆవెంటే జీఓ జారీ  కావడం చకచకా జరిగిపోయాయి. 
  • బీజేపీ సైతం సిద్దిపేట నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈనెల 25న సిద్దిపేటలో మహా పాదయాత్ర నిర్వహించ తలపెట్టింది. మెదక్ ఎంపీ రఘునందన్​ రావు ఆధ్వర్యంలో జరుగనున్న ఈ పాదయాత్రలో  కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొననున్నారు. 

నారాజ్​ లీడర్లకు గాలం...

సిద్దిపేట నియోజకవర్గంపై పట్టు సాధించాలని చూస్తున్న కాంగ్రెస్​, బీజేపీ, టీఆర్​ఎస్ పార్టీలు బీఆర్​ఎస్​ పార్టీలోని అసంతృప్త నేతలను తమ పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నపుడు నామినేటెడ్ పదవులు లభించక, నియోజకవర్గ పరిధి మండలాల్లో గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కక నారాజ్​ అయిన నాయకుల గురించి ఆరా తీస్తూ వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. 

త్వరలో సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు..!

సిద్దిపేట మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్​, బీజేపీ, టీఆర్​ఎస్​ పార్టీలు సిద్దిపేట పట్టణంలో పట్టు పెంచుకోవడంపై స్పెషల్​ ఫోకస్​ పెడుతున్నాయి. మెజారిటీ కౌన్సిలర్​ స్థానాల్లో గెలుపొంది మున్సిపాలిటీపై జెండా ఎగరవేయడం లక్ష్యంగా ఆయా పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. వార్డుల వారీగా ప్రజాబలం ఉన్న నాయకులు ఎవరనేదానిపై కసరత్తు చేస్తున్నాయి.