ఇవాళ(నవంబర్23) కరీంనగర్ కు బీజేపీ చీఫ్ నితిన్.. కాషాయమయమైన నగరం..

ఇవాళ(నవంబర్23) కరీంనగర్ కు బీజేపీ చీఫ్ నితిన్.. కాషాయమయమైన నగరం..
  •      మహాపాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్, వెలుగు: నేడు కరీంనగర్​లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో నగరమంతా కాషాయమయమైంది. పార్టీ చీఫ్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నాయకులు కరీంనగర్ ను కాషాయ తోరణాలు, జెండాలతో అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులతో నింపేశారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నితిన్ నబిన్ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్​లో దిగిన వెంటనే నేరుగా గాంధీబొమ్మ వద్దకు చేరుకుని మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. వైశ్యా భవన్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత వైశ్యాభవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్, శాస్త్రీ రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు ప్రజలతో కలిసి మహా పాదయాత్ర చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.  

లక్షకు తగ్గకుండా మహాపాదయాత్ర

నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో దాదాపు లక్ష మందితో ‘మహా పాదయాత్ర’ నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశారు. గత రెండురోజులుగా పార్టీ నేతలతో వరుస మీటింగ్ లు పెడుతూ జన సమీకరణ, పాదయాత్ర ఏర్పాట్లు, ఫ్లెక్సీల ఏర్పాటు వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పాదయాత్ర స్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు లక్షకు మించి జనం హాజరయ్యేలా బండి సంజయ్ కుమార్ కసరత్తు పూర్తి చేశారు.  తెలంగాణ కళాకారుల ఆట పాటలు, డప్పు నృత్యాలతో నితిన్ నబిన్ కు ఘన స్వాగతం పలకనున్నారు. మహా పాదయాత్రకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు దారిపొడవునా రవాణా, తాగునీటి వసతి సౌకర్యాలను కల్పించారు. దాదాపు లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. 

కరీంనగర్ మహాపాదయాత్ర చరిత్ర సృష్టిస్తుంది : సంజయ్​

కరీంనగర్ లో సోమవారం జరగబోయే నితిన్ నబిన్ ‘మహా పాదయాత్ర’ చరిత్ర సృష్టించడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘సర్’ పేరుతో రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తూ దేశ ప్రతిష్టకు కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో  ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం-.. అరాచకాన్ని అంతం చేద్దాం’ పేరిట దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో బీజేపీ జాతీయ నాయకత్వం ఈ మహాపాదయాత్ర ర్యాలీలు నిర్వహిస్తోందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో వణుకు పుట్టేలా మహా పాదయాత్రను విజయవంతం కాబోతుందని చెప్పారు.