హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదివారం ( నవంబర్ 22 ) నాచారం పోలీసులు, ఎస్ఓటీ ఉప్పల్ జోన్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ తనిఖీల్లో 60 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి దగ్గరి నుంచి 60 కిలోల 380 గ్రాముల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఐడీఏ నాచారం, చిలుకానగర్ రోడ్డులోని స్టెర్లింగ్ షూస్ కంపెనీ సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు, గంజాయి తరలిస్తున్న బ్లూ కలర్ ఫియట్ లీనియా కారును అడ్డుకున్నారు. కారులోని ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, డిక్కీలో నాలుగు గోనె సంచుల్లో 60 ప్యాకెట్ల గంజాయి లభించింది.
