- సొంత భవనం, మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కొత్తపల్లి, వెలుగు : మెడికోల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కుమార్తె వివాహ వేడుకకు వెళ్తున్న ఆయన, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని కాలేజీ ఎదుట ధర్నా చేస్తుండడాన్ని గమనించి వాహనాన్ని ఆపి నేరుగా వారి వద్దకు వెళ్లారు. సొంత భవనం, కనీస మౌలిక వసతులు కల్పించాని, భవన నిర్మాణం పూర్తయినా అప్పగించడంలో జాప్యం జరుగుతోందని మెడికోలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ అక్కడికక్కడే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఫోన్ చేశారు. నూతన కళాశాల భవనాన్ని త్వరగావిద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.
15 రోజుల్లో హాస్టళ్ల అప్పగింత!
విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. కొత్త కళాశాల భవన నిర్మాణం పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పట్టనుండగా, బాలురు, బాలికల హాస్టళ్లను లిఫ్ట్ సదుపాయంతో 15 రోజుల్లో అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నిరంతర విద్యుత్ కోసం కలెక్టర్ చిత్రా మిశ్రా రూ.19 లక్షలు మంజూరు చేయగా, నీటి సరఫరాకు రూ.85 లక్షల అవసరాన్ని గుర్తించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా, మెడికల్ కాలేజీ భవన పనులు, వసతి, రవాణా సదుపాయాలపై సోమవారం సచివాలయంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం భరోసా ఇచ్చారు.
