హైదరాబాద్, వెలుగు: ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను కులంకషంగా చర్చించి, పరిష్కార మార్గాలపై స్పష్టత వచ్చిన తర్వాతే విలీనం చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవనంలో జరిగిన డీటీఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో టి. లింగారెడ్డి మాట్లాడారు. ఇంటర్ విలీనంతో ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, గెజిటెడ్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పీజీటీలు, టీజీటీల మధ్య తలెత్తే సర్వీసు సమస్యలు, బోధనా అర్హతలు, అధికారాల విభజన, ప్రైవేటు–కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల నిర్వహణ వంటి అంశాలపై సంబంధిత సంఘాలు, మేధావులు, నిపుణులతో చర్చించాకే ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
పీఆర్సీ గడువు ముగిసి 40 నెలలు కావస్తున్నదని, నాలుగు డీఏలు, సర్వీసులో ఉన్న, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, హెల్త్ కార్డుల అమలు సరిగా లేదని తెలిపారు. సీపీఎస్ రద్దు హామీని పట్టించుకోవడం లేదని, ఏపీ తరహాలో తెలంగాణలోనూ 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
