- కోటి ఓట్లు.. 90 సీట్లు మళ్లీ మనదే అధికారం ..
- ఢిల్లీకి కాదు.. లీడర్లు పల్లెలకు వెళ్లాలి
- మంచిని మైకులో, చెడును చెవిలో చెప్పండి
- కాంగ్రెస్ నాయకులకు సీఎం సూచన
- మొన్న అంగీ విప్పించా.. ఈసారి లాగు కూడా
- హరీశ్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్ కాకుండా, ఇప్పుడున్న సీట్లతోనే ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో కోటి ఓట్లు, 90 సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాష్ట్రం నుంచి 15 ఎంపీ సీట్లు గెల్చుకొని రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు.
“రాహుల్ గాంధీని ప్రధానిని చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భుజాన వేసుకోవాలి. ఇందిరా గాంధీ చివరి శ్వాస విడిచినప్పుడు మెదక్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎప్పుడూ పార్టీకి అండగా ఉంది. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి అండగా ఉండాలి.
కాంగ్రెస్ జెండాను మోసి రాహుల్‌ను ప్రధానిని చేద్దాం” అని పార్టీ నేతలకు సీఎం పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
జనం వద్దకు వెళ్లినోళ్లే లీడర్
ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని సీఎం రేవంత్ అన్నారు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తున్నామని, ఇందుకు సంబంధించిన కార్యచరణను సిద్ధం చేస్తున్నామని వివరించారు.
‘‘1994 నుంచి 2004 వరకు వరుసగా రెండుసార్లు టీడీపీ, ఆ తర్వాత 2004 నుంచి 20014 వరకు రెండుసార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.
నేను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రాష్ట్రంలో మొదటిసారి హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు 3,700 ఓట్లు సాధించి కేవలం 3 శాతం ఓట్లతో ప్రయాణాన్ని ప్రారంభించి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 92 లక్షల ఓట్లను సాధించాం. 40 శాతం ఓట్లతో 60 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చాం”అని చెప్పారు.
రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజల్లోకి వెళ్దామని పిలుపునిచ్చారు. ‘‘పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి మన ప్రభుత్వం మూడేళ్లలో చేసింది చెప్తే సరిపోతుంది. మూడు తరాలు, నాలుగు దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని అదనంగా అమలు చేస్తున్నాం. నేతలు, కార్యకర్తలు వెళ్లాల్సింది ఢిల్లీకి కాదు.. మారూమూల పల్లెలకు. పేదల వద్దకు. అలాంటి వారి వద్దకు వెళ్లిన వారే పార్టీ నాయకులవుతారు” అని సీఎం అన్నారు.
స్కీమ్‌ల గురించి చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని సీఎం పార్టీ నేతలకు చెప్పారు. ‘‘కోటి మంది ఆడబిడ్డలకుచీరలు అందించబోతున్నాం. కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా, 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ వంటి స్కీమ్‌లను ప్రజలకు చెప్పాలి.
రోజుకు 37 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. రూ.25 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాం. రూ.36 వేల కోట్ల రైతు భరోసా నిధులిచ్చాం. రూ.95 వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేసి రైతు ఖాతాల్లో డబ్బులు వేశాం. 4.75 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చాం. 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 3.42 కోట్ల మందికి సన్న బియ్యం, 2.25 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించాం. కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం” అని వివరించారు.
మంచిని మైకులో చెప్పండి
అచ్చంపేట దగ్గరలో సేవాలాల్ మందిరాన్ని నిర్మించబోతున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. ‘‘జ్యోతిబా ఫూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టుకోబోతునన్నాం. కాళేశ్వరంలో చేసిన పాపాలు కడుక్కోవడానికి సచివాలయానికి మాత్రం అంబేద్కర్ పేరు పెట్టారు”అని వివరించారు. మంచిని మైకులో, చెడును చెవిలో చెప్పాలని పార్టీ నేతలను, కార్యకర్తలకు సూచించారు.
ప్రతి ఒక్కరి మాటలను గమనిస్తున్నం
ప్రతి ఒక్కరి ప్రవర్తన, మాట తీరును నిశితంగా గమనిస్తున్నాం. ఏ నాయకుడు ముందు ఏం మాట్లాడుతున్నారు.. వెనుక ఏం మాట్లాడుతున్నారో సంపూర్ణంగా పార్టీ దగ్గర సమాచారం ఉంది. రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకు ఒకసారి వస్తుంది.
ఎవరి శ్రమ ఎంత ఉందో ఎన్నికల సమయంలో కొలుస్తాం. కష్టపడిన వాళ్లను గుర్తిస్తాం. చెడగొట్టే వాళ్లను కూడా గుర్తుపెట్టుకుంటా. పార్టీ లైన్లో ఉంటే ఇంటికి పదవి దానంతట అదే వస్తుంది. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 65 మందికి పదవులు ఇచ్చాం. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎదురుగా వచ్చి డిస్కో డ్యాన్స్ చేస్తుంది. చూసీ చూడనట్లు ఉంటే కొంత మంది నాయకులు ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
కృష్ణా, గోదావరి నీళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. ‘‘ గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా వేసి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపాం. మరోసారి అధికారంలోకి వస్తామని సిద్దిపేటలో చెప్పా. ఇది చూసి తట్టుకోలేని హరీశ్.. నీళ్లపై చర్చపెట్టలని అన్నడు. ఇది చూసి నేను నవ్వుకున్న. అరే నాయనా.. పోయినసారి మీరు మీ అంతల మీరే బట్టలు విప్పుకొని అసెంబ్లీ ముందు బట్టలు ఇప్పుకొని నిలబడేటట్టు చేసినం. అది మా వ్యూహం. మా ఎత్తుగడ ఏందో.. మేము అనుకుంటే నీకు ఏమై తదో చూపించినం. మొన్న అంగే ఇప్పించా.. ఈసారి లాగు కూడా ఇప్పిస్తా” అని హెచ్చరించారు.
