న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ఇండియా ఆయిల్ దిగుమతి ఖర్చు భారీగా పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్లో మన చమురు, గ్యాస్ దిగుమతి బిల్లు ఏడాది లెక్కన 60 శాతం ఎగబాకి నికరంగా 16 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది అక్టోబర్లో ఇది 10 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేది. అప్పట్లో బ్యారెల్కు 64.75 డాలర్లు ఉన్న బ్రెంట్ క్రూడ్ సగటు ధర, ఈ ఏడాది అక్టోబర్లో రెట్టింపై 124.77 డాలర్లకు చేరడం ఇందుకు ప్రధాన కారణమని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక్క ముడి చమురు దిగుమతి ఖర్చు అక్టోబర్లో 19.5 బిలియన్ డాలర్లకు చేరగా, ఎల్ఎన్జీ దిగుమతి ఖర్చు 1.3 బిలియన్ డాలర్లుగా, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి (ఎల్పీజీ, పెట్ కోక్ మొదలైనవి) విలువ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు ఇండియా నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా - 6.3 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.
అదే ఏప్రిల్–అక్టోబర్ మధ్య నికర దిగుమతి బిల్లు 70.3 బిలియన్ డాలర్ల నుంచి 97.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. దేశీయ అవసరాల్లో 88.7శాతం దిగుమతుల ద్వారానే తీరాయి. హర్మూజ్ జలసంధి రవాణా ఆటంకాలతో ఎల్పీజీ దిగుమతులు భారీగా పడిపోయాయి. అక్టోబర్లో ఎల్పీజీ వినియోగం ఏడాది లెక్కన12.3శాతం తగ్గగా, వంట గ్యాస్ వాడుతున్న కుటుంబాల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్ నాటి 33.4 కోట్ల నుంచి 32.6 కోట్లకు తగ్గింది. అక్టోబర్లో డీజిల్ వినియోగం 12శాతం, పెట్రోల్ 3.5శాతం పెరిగాయి. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి చేరింది.
