చేవెళ్ల, వెలుగు: పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కారణంగానే చేవెళ్లలో మహిళ హత్య జరిగిందని సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్కు చెందిన కేతావత్ శివశంకర్ వరప్రసాద్ నాయక్ అలియాస్ శివ(19), బత్తుల గురువులు, నర్సింహ, అతని భార్య పద్మ చేవెళ్లలో సెంట్రింగ్పనులు చేస్తున్నారు. ఈ నెల 20న గురువులు సెల్‌ఫోన్‌ను శివ చోరీ చేశాడు. అనంతరం ఆ ఫోన్ నుంచి రూ.45 వేలను మరో అకౌంట్‌కు పంపించాడు.
శివపై అనుమానం రావడంతో గురువులు, అతని వద్ద పనిచేసే పద్మ మరుసటి రోజు చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన శివ అదేరోజు పద్మపై కత్తితో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి మృతిచెందింది. అనంతరం శివ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
