- రేవంత్ అవినీతిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్పిండ్రు
- మహిళలను కోటీశ్వరులను కాదు..
- లక్షాధికారులను చేసినా నేను రాజకీయ సన్యాసం చేస్త
- రూ.4 వేల పెన్షన్ ఏమైందని ప్రశ్న
- ఫ్యూచర్ సిటీగా వరంగల్ అభివృద్ధి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో 500 రోజుల తర్వాత కేసీఆర్ సీఎం అవుతారని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన హనుమకొండ కేడీసీ కాలేజీ గ్రౌండ్‍లో నిర్వహించిన జనచైతన్య సభలో ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి, మరో నలుగురు మాజీ కార్పొరేటర్లు బీఆర్‍ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్, బీజేపోళ్లు కలిసి అడ్డగోలు 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. 2028లో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఆ పార్టీ ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు దోచుకున్నాడని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారని తెలిపారు. పనులకు ‘బీస్ పర్సంటేజీ’ కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని అనిరుధ్‌రెడ్డి చెబుతున్నారని, పారిశ్రామికవేత్తల నుంచి వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారని కొండా సురేఖ కుమార్తె ఆరోపించారని పేర్కొన్నారు.
మహిళలను లక్షాధికారి చేస్తే..రాజకీయ సన్యాసం
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్‍రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, కానీ మహిళలను లక్షాధికారులను చేసినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన క్రమంలో ఎన్నికల ప్రచారంలో చెప్పిన నాలుగు వేల పెన్షన్ ఏడబోయిందని ప్రశ్నించారు.
36 నెలల బకాయిలతో కలిపి ఒక్కో మహిళ ఖాతాలో రూ.1.50 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు. మూడేండ్లలో4 లక్షల 70 వేల పెన్షన్లు తీసేసి, కొత్తవి ఇచ్చినంత మాత్రాన పెంచినట్టా అని నిలదీశారు. సీఎం రేవంత్‍రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి బిడ్డలకు సంబంధించిన స్కూళ్లకు లబ్ధిచేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యను రద్దుచేసి..పాఠశాల విద్యలో విలీనం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అసలైన ఫ్యూచర్ సిటీ.. వరంగల్
హైదరాబాద్ సమీపంలోని ఫార్మా సిటీకి పేరు మార్చి ఫ్యూచర్ సిటీగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని కేటీఆర్‌ఎద్దేవా చేశారు. అసలైన ఫ్యూచర్ సిటీ వరంగల్ అని, దాన్ని ప్రధాన ఇండస్ట్రియల్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు.
కేసీఆర్ హయాంలోనే వరంగల్‌కు 24 అంతస్తుల హస్పిటల్, ఆరు మెడికల్ కాలేజీలు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీ కంపెనీలు వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలు రాకపోగా, ఉన్నవి మూతపడ్తుంటే కనీసం కాపాడే సోయి లేదని విమర్శించారు.
నా గడ్డం నీకేం అడ్డమొచ్చింది
రేవంత్‍రెడ్డికి తన గడ్డంపై వ్యాఖ్యలు చేయడం తప్పితే రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టే ఆలోచన లేదని విమర్శించారు. ‘నా గడ్డం నీకేం అడ్డమొచ్చింది. రైతు భరోసా, రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి అడ్డమొచ్చిందా అని ప్రశ్నించారు. రేవంత్‍రెడ్డి మాదిరి ఉండాలని ఇజ్జత్ ఉన్నోళ్లు ఎవరూ కోరుకోరని ఎద్దేవా చేశారు. 750 టీఎంసీల గోదావరి నదిజలాలు కిందకు పోతుంటే రిజర్వాయర్లు నింపి రైతులను ఆదుకునే తెలివి లేదన్నారు. ముఖ్యమంత్రికి బూతులు తిట్టడం తప్పితే రాష్ట్రానికి చేసిందేమిలేదేన్నారు.
ఢిల్లీకి కాంగ్రెస్, బీజేపీ నేతల గులాంగిరి
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కనపడగానే రేవంత్‍రెడ్డి బాడీగార్డ్ అవుతుంటే.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు వారివెంట పరుగులు పెడ్తున్నారని ఎద్దేవా చేశారు.
అమిత్ షా ఎప్పుడు చెప్పులు ఇడుస్తాడా అని ఓ బీజేపీ నేత ఎదురుచూస్తుంటే.. మరోనేత ఏకంగా వారి కాళ్లు మొక్కుతున్నాడన్నారన్నారు. సభలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతిరాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‍రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణరెడ్డి, శంకర్ నాయక్, నేతలు ఏనుగుల రాకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
