- కేంద్ర హోం శాఖ ఐ4సీ అడ్వైజరీ
న్యూఢిల్లీ: ఆఫీసు, పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం శాఖ పరిధిలోని సైబర్ నేరాల నిరోధక విభాగం ఐ4సీ హెచ్చరించింది. లాగిన్ చేసి అలాగే వదిలేస్తే సైబర్ కేటుగాళ్లు ఖాతాల్లోకి చొరబడి కాంటాక్టులు, మెసేజ్‌లు దొంగిలించి, ఖాతాదారుల పేరుతో మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపింది. బ్రౌజర్ ట్యాబ్ క్లోజ్ చేస్తే సరిపోదని, ప్రతిసారి తప్పనిసరిగా లాగౌట్ చేయాలని సూచించింది. సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్ల వంటి చోట్ల, ఇతరుల కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడొద్దని, తప్పని సరైతే ఇన్‌కాగ్నిటో ట్యాబ్ వాడాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని అడ్వైజరీలో పేర్కొంది.
