- కావ్య మారన్ పెండ్లి సందర్భంగా కానుక
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
చెన్నై: సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కూతురు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ పెండ్లి సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు కానుకగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగులకు అందిన గిఫ్ట్ బాక్సుల్లో పెండ్లి పత్రిక, చాక్లెట్లతో పాటు బంగారు ఉంగరాలు ఉన్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. బాక్స్ తెరిచిన ఉద్యోగులు ఉంగరం చూసి ఆశ్చర్యపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ కానుకలపై, ఎంతమంది ఉద్యోగులకు ఇచ్చారనే దానిపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఆ పత్రికలో ఈ నెల 25న విందు ఉంటుందని ఉన్నట్లు సమాచారం.
గ్రీస్‌లో పెండ్లి.. చెన్నైలో రిసెప్షన్
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కావ్య మారన్ పెండ్లి ఈ నెల 11న గ్రీస్‌లో జరిగింది. శనివారం చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. కావ్య, అనిరుధ్ పెండ్లి ‘ఆత్మగౌరవ వివాహం’ (సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్) పద్ధతిలో జరిగిందని, వధూవరులు పూలమాలలు, గొలుసులు మార్చుకున్నారని డీఎంకే ఐటీ వింగ్ సెక్రటరీ డాక్టర్ టీఆర్బీ రాజా వెల్లడించారు.
ఇదీ ఆత్మగౌరవ వివాహం
సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామసామి తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా ఈ పెండ్లి పద్ధతిని తెచ్చారు. ఇందులో పురోహితులు, మంత్రాలు, సంప్రదాయ క్రతువులు ఉండవు. వధూవరులు సాక్షుల సమక్షంలో పూలమాలలు లేదా ఉంగరాలు మార్చుకుని ప్రమాణం చేస్తారు. సమాన హక్కులు, ఒకరిపై ఒకరికి గౌరవానికి గుర్తుగా ఈ పెండ్లిళ్లు జరుగుతాయి. తమిళనాడులో 1967లో హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణతో ఈ పెండ్లిళ్లకు చట్టబద్ధత వచ్చింది. కావ్యమారన్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో గా, సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
