- జయలలిత వారసురాలిగా త్రిష?..
- విజయ్‌తో కలిసి పనిచేయాలని అభిమానుల ఆకాంక్ష
- ‘ఇళయ పురచ్చి తలైవీ త్రిష’ పేరుతో ఫోరం ఏర్పాటు
చెన్నై: ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ రాజకీయాల్లోకి రావాలని కోరుతూ అభిమానులు ఒక ప్రత్యేక ఫోరమ్ ఏర్పాటుచేశారు. తమిళనాడు సీఎం విజయ్ తో కలిసి ఆమె పని చేయాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించి సోమవారం'ఇళయ పురచ్చి తలైవీ త్రిష' (యువ విప్లవ నాయకి) పేరుతో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. దివంగత మాజీ సీఎం జయలలితకు ఉన్నట్లే త్రిషకు కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉందని అభిమానులు పేర్కొన్నారు. అందుకే ఆమెకు ‘ఇళయ పురచ్చి తలైవి’ బిరుదు ఇచ్చినట్లు చెప్పారు.
త్రిషను జయలలిత వారసురాలిగా అభివర్ణించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని పరిణామాలపై పూర్తి అవగాహనతో ఉండేవారని, అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారని ఫ్యాన్స్ గుర్తుచేశారు. టీవీకే ప్రభుత్వానికి త్రిష నాయకత్వం తోడైతే మళ్లీ రాష్ట్రంలో జయలలిత పాలన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే తన రాజకీయ ప్రవేశంపై త్రిష ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు సీఎం విజయ్, -నటి త్రిష మధ్య రిలేషన్స్ పై రూమర్స్ ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపగా.. ఇప్పుడు ఫ్యాన్స్ ఆమె పొలిటికల్ ఎంట్రీని కోరడం చర్చనీయాంశమైంది.
