వెలుగు స్పెషల్ : రైతు సంక్షేమమే లక్ష్యంగా.. కొత్త సహకార సంఘాలు!

వెలుగు స్పెషల్ : రైతు సంక్షేమమే లక్ష్యంగా..   కొత్త సహకార సంఘాలు!

13 ఏళ్ల తర్వాత కొత్త పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటుకు శ్రీకారం జరిగింది. 240 సంఘాలతో గ్రామీణ వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వచ్చింది. రైతన్నకు మరింత చేరువగా సహకార సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతులకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఏర్పాటుకు అనుమతించడం ఆహ్వానించదగిన పరిణామం. దాదాపు 13 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 240 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడం పల్లెసీమల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
 
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్న రైతన్నకు పెట్టుబడి నుంచి పంట విక్రయం వరకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, పెట్టుబడి సాయం, పండించిన ధాన్యానికి మద్దతు ధర వంటి అంశాల్లో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇవి కొండంత అండగా నిలుస్తున్నాయి. కరోనా కష్టకాలంలోనూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో సహకార సంఘాలు అందించిన సేవలు వాటి ప్రాధాన్యతను చాటిచెప్పాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 908 సహకార సంఘాలకు అదనంగా మరో 240 సంఘాలు అందుబాటులోకి వస్తే సహకార సేవలు మరింతమంది రైతులకు చేరువయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామస్థాయిలోనే రుణాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు పొందేందుకు రైతులకు వెసులుబాటు కలుగుతుంది.

రుణాలకే పరిమితం కాకుండా.. బహుళ సేవా కేంద్రాలుగా!

మారుతున్న కాలానికి అనుగుణంగా సహకార సంఘాల  పనితీరులోనూ మార్పులు రావాలి. కేవలం పంట రుణాలు ఇచ్చే సంస్థలుగా కాకుండా రైతులకు, గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే  బహుళ ప్రయోజన కేంద్రాలుగా ఎదగాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నమూనా ఉపనియమాల ప్రకారం పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 25కి పైగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉండటం గ్రామీణ అభివృద్ధికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. జన్ ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు తక్కువ ధరకు మందులు అందించవచ్చు. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చి రైతుల సాగు ఖర్చును తగ్గించవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బ్యాంకింగ్, బీమా, ఆధార్ సేవలు, ఇతర ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలోనే అందించవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా పనిచేస్తూ ఎరువులు, వ్యవసాయ సంబంధిత సేవలను రైతుల ముంగిటకు తీసుకెళ్లవచ్చు.

పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు

ఇదే కాకుండా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ పంపిణీ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, గోదాములు, ధాన్యం నిల్వ కేంద్రాలు, డెయిరీ, మత్స్యపరిశ్రమ, రైస్ మిల్లులు, సూపర్ మార్కెట్లు, వాటర్ ప్లాంట్లు వంటి వ్యాపారాలను సహకార సంఘాలు నిర్వహించవచ్చు. గ్రామీణ తాగునీటి పథకాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలు కూడా చేపట్టవచ్చు. తద్వారా సంఘాలకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా గోదాములు, నిల్వ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రైతులు పంట పండగానే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తగ్గుతుంది. సరైన సమయంలో పంటను విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. రైతుల ఆదాయం పెరగడానికి ఇటువంటి అనుబంధ కార్యకలాపాలు దోహదపడతాయి. 

సహకారంతోనే పల్లెల ప్రగతి

240 కొత్త సహకార సంఘాల  ఏర్పాటు గ్రామీణ వ్యవసాయ రంగంలో ఒక మంచి ఆరంభం కావాలి. ప్రతి సంఘం రైతన్నకు అందుబాటులో ఉంటూ, అతడి అవసరాలకు తగ్గట్టుగా సేవలు అందించాలి. రైతుకు ఆర్థిక భరోసా, యువతకు ఉపాధి,  గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందినప్పుడే సహకార వ్యవస్థ లక్ష్యం నెరవేరుతుంది. సహకారం అనేది కేవలం ఒక సంస్థాగత వ్యవస్థ కాదు.. అది సమష్టి అభివృద్ధికి బాట. రైతన్న బలపడితేనే వ్యవసాయం బాగుపడుతుంది. వ్యవసాయం బాగుంటేనే పల్లెలు సుభిక్షంగా ఉంటాయి. అందుకే రైతు సంక్షేమమే లక్ష్యంగా కొత్త సహకార సంఘాలను బలోపేతం చేస్తూ, వాటిని గ్రామీణ స్వయం సమృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కొత్త సంఘాలకు వసతులు కల్పించాలి

కొత్త సహకార సంఘాల ఏర్పాటు వాటికి అవసరమైన భవనాలు, సిబ్బంది, నిధులు, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చాలి. సంఘాల నిర్వహ
ణలో రాజకీయ జోక్యం, అవినీతికి తావులేకుండా పారదర్శకతకు పెద్దపీట వేయాలి. ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. రైతుల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా సంఘాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. కొత్త సంఘాల ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న 908 సంఘాల బలోపేతంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. నష్టాల్లో ఉన్న సంఘాలను గాడిలోపెట్టి, లాభదాయకమైన కార్యకలాపాలవైపు నడిపించాలి. విజయవంతంగా నడుస్తున్న సహకార సంఘాల నమూనాలను ఇతర ప్రాంతాలకూ విస్తరించాలి.

- వై.రవితేజ 
ఏఈఓల ఐక్య వేదిక 
రాష్ట్ర అధికార ప్రతినిధి