పశ్చిమ బెంగాల్ పేరు మారింది.. ఇక నుంచి 'పశ్చిమ బంగా'..!

పశ్చిమ బెంగాల్ పేరు మారింది.. ఇక నుంచి 'పశ్చిమ బంగా'..!

కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ‘పశ్చిమ బంగా’గా మార్చుతూ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని డిసెంబర్ 9వ తేదీన బెంగాల్ సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇంగ్లీష్‌లో కూడా ఇకపై 'పశ్చిమ బంగా' (Paschim Banga)గా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక తీర్మానాన్ని డిసెంబర్ 9వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్రం పేరును మార్చడం వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయని ముఖ్యమంత్రి సువేందు అధికారి పేర్కొన్నారు. 1947లో దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ ఏర్పడిన తీరును, ఆనాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. "ఇంగ్లీష్‌లో కూడా పశ్చిమ బెంగాల్ అనే పదానికి బదులుగా 'పశ్చిమ బంగా' అనే రాయాలి. ఇది రాష్ట్ర ఏర్పాటు చరిత్రతో ముడిపడి ఉన్న అంశం. డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తర్వాత, దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. అక్కడ పార్లమెంట్ ఆమోదం పొందాక ఇది చట్టబద్ధమవుతుంది" అని ఆయన వివరించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, ఏదైనా రాష్ట్రం పేరు మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ పేరు మార్పు అంశం గత దశాబ్ద కాలంగా చర్చల్లోనే ఉంది. గతంలో 2011లో 'పశ్చిమ బంగా' లేదా 'పశ్చిమ బంగో'గా పేరు మార్చాలని ప్రతిపాదించినప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. ఆ తర్వాత 2016 నుంచి 2018 మధ్య అప్పటి ప్రభుత్వం 'బంగ్లా' అనే పేరును ప్రతిపాదించి అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే, ఈ ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

పశ్చిమ బెంగాల్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్‌లో ప్రభుత్వం మొత్తం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు డిసెంబర్ 9న రాష్ట్ర పేరు మార్పుపై ప్రవేశపెట్టే తీర్మానం అత్యంత కీలకంగా మారనుంది. శాసనసభలో తీర్మానం నెగ్గిన తర్వాత, తుది ఆమోదం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికను పంపనున్నారు. కేంద్రం ఆమోదం తెలిపి, పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయితేనే అధికారికంగా పేరు మార్పు అమల్లోకి వస్తుంది.