పెళ్లి.. పెళ్లి.. పెళ్లి.. దేశంలో పెళ్లి గోల ఎక్కువైపోయింది. డబ్బున్నా అమ్మాయిలు నచ్చక కొంత మంది.. నచ్చిన అమ్మాయి దొరక్క మరికొందరు.. వ్యవసాయం అని ఇంకొందరు.. చిన్న ఉద్యోగం అని మరికొందరు.. వస్తున్న సంపాదన పెళ్లాం, పిల్లలకు సరిపోదని మరి కొందరు ఇలా దేశంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. అలా అని అమ్మాయిలు లేరా అంటే ఉన్నారు. అమ్మాయిలకు నచ్చిన అబ్బాయిలు దొరకక ఇబ్బందులు ఒకటి అయితే.. అన్నీ ఉండి అమ్మాయిలు నచ్చక మరికొందరు.. ఇలా దేశంలోని పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల పరిస్థితిని.. ఓ ఉదాహరణకు వెళ్లడించారు ప్రముఖ మ్యాట్రిమోనియ్ సైట్ సీఈఓ. సంవత్సరానికి కోటి 27 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఓ యంగ్ కుర్రోడు.. తనకు కాబోయే భార్య విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాడు. దీనికి సంబంధించిన పోస్టు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఏటా రూ.కోటి 27లక్షల భారీ వేతనం అందుకుంటున్న ఒక యువకుడికి తగిన జీవిత భాగస్వామిని వెతకడం ఒక మ్యాట్రిమోనీ సంస్థకు సవాలుగా మారింది. ఐఐటీలో చదువుకుని కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ.. తన గతం, వర్తమానం రెండింటినీ సమానంగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలన్న అతని వింత నిబంధన ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'నాట్ డేటింగ్' (Knot Dating) మ్యాట్రిమోనీ సంస్థ సీఈఓ జస్వీర్ సింగ్ ఈ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ యువకుడు ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగాడు. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం మెట్రో నగరానికి మారాడు. IITలో పట్టా పొంది.. ప్రస్తుతం గట్టి ప్యాకేజీతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డాడు. వృత్తిపరంగా ఇంతటి విజయం సాధించినా.. పెళ్లి విషయంలో మాత్రం అతనికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మ్యాట్రిమోనీ సంస్థను సంప్రదించిన ఆ యువకుడు.. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి స్పష్టమైన వివరణ ఇచ్చాడని సింగ్ పేర్కొన్నారు. సాధారణంగా ఇంత భారీ ప్యాకేజీ ఉన్నవారు తమకు సమానమైన హోదా లేదా ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబాల సంబంధాలను కోరుకుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం తనకు రిచ్ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయిలు వద్దని తెగేసి చెప్పాడు. గతంలో తాను సౌత్ ఢిల్లీ, సౌత్ ముంబై లాంటి రిచ్ పాష్ ఏరియాల్లోని అమ్మాయిలతో డేట్ చేసినట్లు చెప్పాడు ఆ యువకుడు.
ఆర్థికంగా, సామాజికంగా వారు సరిజోడి అనిపించినా.. ఆలోచనా దృక్పథంలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయని కుర్రోడు గుర్తించాడు. చిన్నతనం నుంచి పెరిగిన వాతావరణం, లైఫ్‌స్టైల్ వేరుగా ఉండటంతో వారితో కనెక్ట్ కాలేకపోయినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా మ్యూజిక్, ఫుడ్ వంటి చిన్న చిన్న విషయాల నుంచి కుటుంబ విలువలు, సంబంధాలు, లింగ సమానత్వం వంటి అంశాల వరకు ఎక్కడా తన ఆలోచనలతో వారు ఏకీభవించలేదని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
మెట్రో నగరాల్లోని అమ్మాయిలు సెట్ కాకపోవడంతో.. అతను చిన్న పట్టణాలకు చెందిన యువతులను కలవడం ప్రారంభించాడు. అయితే అక్కడ మరో రకమైన సమస్య ఎదురైంది. గత 10 ఏళ్లుగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఆ యువకుడి ఆసక్తులు, అంచనాలు మారిపోయాయి. అతను బిజినెస్, టెక్నాలజీ, ప్రపంచ పరిణామాలు వంటి అంశాలపై చర్చించాలని కోరుకున్నాడు. కానీ చిన్న పట్టణాలకే పరిమితమైన యువతులతో ఈ అంశాలపై సంభాషించడం, వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం ఇబ్బందిగా మారింది.
ఈ మొత్తం పరిస్థితిని ఆ యువకుడు 'టూ నేషన్ థియరీ'గా అభివర్ణించాడు. భారతదేశంలోనే ఉంటూ రెండు భిన్నమైన ప్రపంచాల్లో బతుకుతున్నట్లు అతను భావిస్తున్నాడు. సంపన్న మెట్రో నగరాల మహిళలకు తన ప్రస్తుత జీవనశైలి అర్థమవుతుంది కానీ.. తన చిన్ననాటి నేపథ్యం అర్థం కాదు. అటు చిన్న పట్టణాల మహిళలకు తన మూలాలు తెలుసు కానీ.. తాను ఇప్పుడున్న స్థితిని, తన ఆలోచనలను వారు అర్థం చేసుకోలేకపోతున్నారని యువకుడు అంటున్నాడు.
చివరికి అతను మ్యాట్రిమోనీ టీమ్‌కు ఒకే ఒక కండిషన్ పెట్టాడు. తనకు కాబోయే భార్య చిన్న పట్టణంలో పుట్టి పెరిగి ఉండాలి.. ఆ తర్వాతే పెద్ద నగరానికి వచ్చి చదువుకుని, స్వతంత్రంగా ఎదిగి ఉండాలి. అంటే ఒక చిన్న పట్టణ వాతావరణం నుంచి మెట్రో నగర జీవనశైలికి మారే క్రమంలో ఉండే సాధకబాధకాలు తెలిసిన వ్యక్తి అయితేనే తనకు సరైన భాగస్వామి అవుతుందని కుర్రోడు అభిప్రాయపడుతున్నాడు.
