ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై ఢిల్లీ కోర్టు సోమవారం ( నవంబర్ 23 ) నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో నమోదైన ఒక పరువు నష్టం కేసులో జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనమ్ రైస్ ఖాన్ ఈ ఆదేశాలు వెలువరించారు. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
బీజేపీ ఐటీ సెల్ తనను లంచంతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ 2018 మే నెలలో ధ్రువ్ రాథీ ఒక వీడియోను అప్లోడ్ చేశారు. అందులో వికాస్ సాంకృత్యాయన్ పేరును ప్రస్తావించారు. ఆ వీడియోను అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా రీట్వీట్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ ఆరోపణలు ఉన్నాయంటూ వికాస్ పాండే.. రాథీతో పాటు కేజ్రీవాల్‌పై కూడా పరువు నష్టం దావా వేశారు.
గతంలో కూడా ఈ కేసులో రాథీపై కోర్టు బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. అక్టోబర్ 17న కోర్టు నోటీసులను అందజేయడానికి ప్రాసెస్ సర్వర్ వెళ్లగా, హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న రాథీ నివాసానికి తాళం వేసి ఉందని కోర్టుకు నివేదించారు. ఆ తర్వాత అక్టోబర్ 31న కోర్టు మరోసారి వారెంట్లు జారీ చేసింది. అయినప్పటికీ రాథీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
విచారణ సమయంలో ధ్రువ్ రాథీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. రాథీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని కోర్టుకు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే ఆయన భారత్‌కు వచ్చారని పేర్కొన్నారు. రాథీకి 2019 జూలైలోనే తొలిసారి సమన్లు జారీ అయ్యాయని తెలిపారు.
ఫిర్యాదుదారు వికాస్ పాండే తరఫున అడ్వకేట్ సమక్ష్ శర్మ వాదిస్తూ.. రాథీ ప్రధానంగా విదేశాల్లోనే ఉంటున్నారని, అందువల్ల గత కొన్ని ఏళ్లుగా సమన్లు అందలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను వేగవంతం చేసేందుకు వారెంట్ జారీ చేయాలని కోరారు. అక్టోబర్ 12న కోర్టు ఈ కేసులో ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను అనుమతించింది. హ్యాండ్ డెలివరీ ద్వారా సమన్లు పంపాలని కూడా గతంలో ఆదేశించింది.
ధ్రువ్ రాథీ తన వీడియోలో చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, అవి తన గౌరవానికి భంగం కలిగించాయని ఫిర్యాదుదారు వికాస్ పాండే తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణ డిసెంబర్ మొదటి వారంలో జరగనుంది.
