కోటా (రాజస్థాన్): పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని ఆనందంగా తిరుగుపయనమైన ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఆగి ఉన్న లారీని వారి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో క్రూజర్ లోని ఆ ఫ్యామిలీలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోటా ఉదయ్‌పూర్ హైవేపై శంభుపుర గ్రామం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.
మహారాష్ట్రకు చెందిన ఈ కుటుంబ సభ్యులు ఖాటు శ్యామ్‌జీ ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి స్వస్థలానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న క్రూజర్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాద వివరాలు..
క్రూయిజర్‌లో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, గాయపడిన మరో ఆరుగురిని చికిత్స నిమిత్తం కోటాలోని న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులంతా బంధువులేనని, మొత్తం 3 వాహనాల్లో 36 మందిమి యాత్ర చేపట్టామని బాధితుల బంధువులు తెలిపారు. రెండు వాహనాలు వెనుక ఉండిపోగా, ప్రమాదానికి గురైన వాహనం ముందుకెళ్లిందని, విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
కోటా రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే ఎస్పీ సహా పోలీసు బృందాలు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
