ట్రంప్ ఫోన్ చేసినా పట్టించుకోని కిమ్ ..చర్చలపై ఆసక్తి చూపని ఉత్తర కొరియా

ట్రంప్ ఫోన్ చేసినా పట్టించుకోని కిమ్ ..చర్చలపై ఆసక్తి చూపని ఉత్తర కొరియా

వాషింగ్టన్‌‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంప్రదింపుల ప్రయత్నాలకు ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ గట్టి ఝలక్ ఇచ్చారు. ట్రంప్ చేస్తున్న ఫోన్ కాల్స్‌‌ను పట్టించుకోకపోవడమే కాకుండా, ఆయన పంపిన లెటర్‌‌‌‌ను కనీసం తెరవకుండానే తిరిగి పంపించి వేశారు. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. 

ఇరు దేశాల మధ్య మళ్లీ దౌత్యపరమైన చర్చలు ప్రారంభించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతున్నాయని తెలిపింది. గత ఏడాది అధికారిక ఫోన్ లైన్లు, ఇతర మార్గాల ద్వారా కిమ్‌‌ను సంప్రదించేందుకు ట్రంప్ పలుమార్లు ప్రయత్నించారు. కానీ ప్యాంగ్‌‌యాంగ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో నేరుగా కిమ్‌‌కు ఒక లెటర్ పంపాలని ట్రంప్ నిర్ణయించారు.

ఐక్యరాజ్యసమితిలోని (యూఎన్) ఉత్తర కొరియా  కార్యాలయం ద్వారా ఆ లెటర్‌‌‌‌ను అందజేయాలని వైట్‌‌హౌస్ అధికారులు ప్రణాళిక వేశారు. ఈ క్రమంలో కొందరు అమెరికా అధికారులు ఉత్తర కొరియా కార్యాలయం బయట వేచి ఉండి, అటుగా వెళ్తున్న ఆ దేశ దౌత్యవేత్త చేతికి ఆ లెటర్‌‌‌‌ను అందించారు. అయితే, ఆ దౌత్యవేత్త  తెరవని లెటర్‌‌‌‌ను ఆ తర్వాత జరిగిన ఒక యూఎన్ సమావేశంలో అమెరికా ప్రతినిధి ముందు పెట్టి వెళ్లిపోయారు.

చర్చలపై ఆసక్తి చూపని కిమ్  

ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కిమ్‌‌తో మూడుసార్లు సమావేశమై, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చివరి నిమిషంలో కిమ్‌‌తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించినా.. కిమ్  విధించిన షరతులతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. అమెరికాతో తిరిగి స్నేహం చేయడానికి గానీ, తమ అణ్వాయుధ కార్యక్రమాలను వదులుకోవడానికి గానీ కిమ్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.