బిహార్‌‌‌‌‌‌‌‌లో ‘నితీశ్‌‌‌‌ సేతు’పై ఆర్జేడీ రచ్చ ..తేజస్వీ యాదవ్‌‌‌‌కి ఆహ్వానం లేకపోవడంపై కార్యకర్తల నిరసన

బిహార్‌‌‌‌‌‌‌‌లో ‘నితీశ్‌‌‌‌ సేతు’పై ఆర్జేడీ రచ్చ ..తేజస్వీ యాదవ్‌‌‌‌కి ఆహ్వానం లేకపోవడంపై కార్యకర్తల నిరసన
  • ఎన్డీఏ పోస్టర్లు, బ్యానర్లు చించివేత
  • లాలూ, తేజస్వీకి అనుకూలంగా నినాదాలు 

పట్నా: బిహార్‌‌‌‌లోని వైశాలి జిల్లాలో ఆరు లేన్ల ‘నితీశ్ సేతు’వంతెనపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కార్యకర్తలు వంతెనపై వీరంగం సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ వంతెనను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ కార్యకర్తలు నితీశ్‌‌‌‌ సేతుపై ఆందోళనకు దిగారు. 

ఎన్డీఏకు చెందిన పోస్టర్లు, బ్యానర్లను చించివేస్తూ.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌‌‌‌ యాదవ్‌‌‌‌, తేజస్వీ యాదవ్‌‌‌‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారాయి. పెద్ద సంఖ్యలో మోటార్‌‌‌‌ సైకిళ్లపై వచ్చిన కార్యకర్తలు దాదాపు 40 నిమిషాల పాటు హంగామా సృష్టించారు. 

పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. దీంతో బీజేపీ, ఆర్జేడీ మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. తేజస్వీ యాదవ్‌‌‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రఘోపూర్‌‌‌‌ నియోజకవర్గ పరిధిలోనే ఈ వంతెన ఉంది. వంతెనకు సంబంధించిన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగినప్పుడు తేజస్వీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

 అయితే, ప్రారంభోత్సవానికి తేజస్వీని పిలవకపోవడంతోనే ఆర్జేడీ కార్యకర్తలు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే, ఆర్జేడీ మాత్రం అలజడి సృష్టిస్తోంది. బిహార్ ప్రజలకు వంతెనలు, ప్రగతి కావాలి తప్ప పోస్టర్లు చించే రాజకీయాలు కాదు’అని మండిపడ్డారు. 

మరోవైపు, ఆందోళనకారుల చర్యను ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ ఆదివారం సమర్థించారు. ఈ వంతెనను గతంలోనే ప్రారంభించారని, కేవలం పేరు మార్చడం కోసమే రూ.కోట్ల ఖర్చు చేసి రెండోసారి ప్రారంభోత్సవం చేశారని ఆరోపించారు. వంతెనపై జరిగింది నిరసన మాత్రమేనని, ఆ పని చేసిన వారు సరైనదే చేశారన్నారు.