- వారి మనసుల్లో కోపం, ద్వేషం గూడుకట్టుకున్నయ్
- వారికి ఆధ్యాత్మిక సంప్రదాయాలపై అవగాహన శూన్యం
- అర్ధనారీశ్వరుడి శిల్పం ఫొటోతో ట్వీట్
- సోనియా పుస్తకావిష్కరణ సభలో వ్యాఖ్యలపై వివరణ
న్యూఢిల్లీ: భారతీయ ఆధ్యాత్మిక, మతపరమైన సంప్రదాయాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు కనీస అవగాహన లేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వారు సంస్కార హీనులు, అనాగరిక పురుషాహంకారులు, కులతత్వ వాదులని ఆయన ఆరోపించారు.
ఈమేరకు ఎలిఫెంటా గుహల్లోని శివుడు, పార్వతీదేవి కలిసి ఉన్న ‘అర్ధనారీశ్వర’ శిల్పానికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. తన తల్లి సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ సభలో తన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో రాహుల్ ఈ పోస్ట్ చేశారు.
‘‘భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను లోతుగా అధ్యయనంచేస్తే నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు అత్యాశపరులు, కులతత్వ వాదులు. వారికి మన సంప్రదాయాల గురించి ఏమీ తెలియదు’’ అని రాహుల్ పేర్కొన్నారు. అర్ధనారీశ్వర రూపం అనేది
హిందూ ధర్మంలో శివుడు, పార్వతి కలిసి ఉన్న సగం పురుషుడు, సగం స్త్రీ రూపం. ఇది స్త్రీ, పురుష సమానత్వానికి సంకేతమని ఆయన వివరించారు. అంతకుముందు మంగళవారం కూడా రాహుల్ గాంధీ ఇటువంటిదే ఓ పోస్ట్ చేశారు. 12వ శతాబ్దానికి చెందిన ఒక ఆలయ శిల్పంలో పార్వతీదేవి పరమశివుడి ఒడిలో కూర్చున్న ఫొటోను ఆయన షేర్ చేశారు.
నిజమైన హిందువుగా అది నా బాధ్యత
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల మనసుల్లో భయం, కోపం, ద్వేషం గూడుకట్టుకున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘నిజమైన హిందువుగా వారిని ఈ ద్వేషం నుంచి విముక్తులను చేయడం నా బాధ్యత. అప్పుడే వారు తమ జీవితాల్లో ప్రేమలోని అందాన్ని, సంతోషాన్ని అనుభవించగలరు. సత్యం శివం సుందరం’’ అని ఆయన పేర్కొన్నారు.
పుస్తకావిష్కరణలో ఏమన్నారంటే..
సోనియా గాంధీ పుస్తక ఆవిష్కరణ సభలో రాహుల్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు. ‘‘భోజనం చేసే సమయంలో నాన్న ఒడిలో అమ్మ కూర్చునేవారు. అది మా ఇంట్లో సాధారణ విషయం. కానీ నా స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు అలా ఉండేవారు కాదు. మీ అమ్మ ఎందుకు నాన్న ఒడిలో కూర్చోవడం లేదని నేను నా స్నేహితులను అడిగేవాడిని’’ అని రాహుల్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ మద్దతు.. బీజేపీ విమర్శలు
రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. లోక్సభ ప్రతిపక్ష నేత సమాజంలో అవసరమైన చర్చను ప్రారంభించారని పార్టీ పేర్కొంది. ప్రేమను దాచుకోవాల్సిన అవసరంలేదని, భాగస్వామిని సమానంగా గౌరవించడమే అసలైన సమానత్వమని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. మరోవైపు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ తన తల్లిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ అనే ‘ఉత్పత్తి’ మార్కెట్లో క్లిక్ అవదని ఆయన ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ రాహుల్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ఆయన నిజాయతీని సమర్థిస్తుంటే, మరికొందరు ఆయన శైలిని తప్పుబడుతున్నారు.
