‘ప్రాణమైనా పోనీ పాట మానకే
పాట మాని నీ బతుకు నడక మార్చకే..’
అని రాయగలిగేది పాటను రక్తంలో కలుపుకున్నవాడే. బతుకును పాటగా, గాయాన్ని గానంగా, ధిక్కారాన్ని దరువుగా మలచుకున్నవాడే. అలాంటి అక్షరాల మనిషి లెల్లే సురేష్. ‘పాటలో మనిషి’ – ఇది కేవలం పాటల సంపుటి కాదు. మనసుకు ఎత్తిపట్టిన దోసిలి.
దళిత సౌందర్యపు సంతకం. తెలుగు పాటకు సరికొత్త ఈస్తటిక్స్‌ను అద్దిన కవితా ప్రయోగం. భావుకత్వం, కళాత్మక సౌందర్యం, తాత్విక గాఢత ఒకే గొంతులో పలికినప్పుడు లెల్లే సురేష్ పాటవుతుంది. ఈ పాటల్లో గాయాల సలపరింత ఉంది. ఇది ఒడవని దుఃఖపు ఆవేదన. కోల్పోయిన బతుకుల వెతుకులాట. గతానికీ వర్తమానానికీ మధ్య విషాదపు బేరీజు. కన్నీటి తడితో మెరిసే అక్షరాలున్నాయి.
ఎడబాట్ల ఏకాంత గానం. అదే సమయంలో ప్రకృతి పూనకం. ఇది హద్దులు లేని ప్రేమైక బంధాల కానుక. అవధులు లేని భావ గాఢత. లెల్లే సురేష్ ఉపమానాలు కేవలం అందాన్ని అద్దవు. అనుభవాన్ని కొత్తగా చూపిస్తాయి. ఆయన కవితా పాదాలు మనల్ని మైమరపింపజేస్తూనే మనలోని నిశ్శబ్దాన్ని కదిలిస్తాయి. ఆయన పదాల్లోని కొత్త వ్యక్తీకరణ మనసును కట్టిపడేయడమే కాదు, మనిషిని కొత్తగా చూడమంటుంది.
బాధను కవిత్వంగా, జ్ఞాపకాన్ని సజీవంగా, శ్రమను ఆత్మగౌరవంగా, ధిక్కారాన్ని సామూహిక గొంతుగా మలచడమే ఈ పాటల ప్రత్యేకత. అందుకే ఇవి వినిపించి ముగిసిపోయే పాటలు కావు. మనలో మోగుతూ ఉండే జీవన గానాలు. ఈ పాటల పాదాల్లోని సింబాలిజం మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
జీవితాన్ని ప్రకృతితోను, ప్రకృతిని మనిషితోను పెనవేయగల నేర్పరి. ఒక పాటలో ప్రకృతిలోని నీటిని జాబిలిగా, ఆ జాబిలి ముద్దును మనిషి అనుభూతిగా మలిచాడు సురేష్. ఇక్కడ వెన్నెల నిండిన రాత్రి పగిలిపోవడం అనే అసాధారణ ఊహలో భగ్నప్రేమికుడై తన లోలోపలి అగ్నిపర్వతాన్ని ఉప్పెన చేసి నిలుపుతాడు. మరో చోట సామాజిక ఉద్యమకారుడై విద్యుత్ ప్రవాహమై పోటెత్తుతాడు.
‘ఊరు నుండి వెలివేస్తే
వాడలోకి వచ్చినాము
గుడి నుండి వెలివేస్తే
మా గుడిసెను గుడి చేసినాము
భూమి మా జన్మహక్కు
భూమి మా చావుబతుకు’ (‘ఆయిలల్ల చల్’)
‘గాయపడ్డ – తెలంగాణ
గర్జించే – తెలంగాణ
గాండ్రించు – తెలంగాణ
ఘోషించే – తెలంగాణ
చెల్లదు చెల్లదు ఇకపై చెల్లదు
దొరల పెత్తనం ఇకపై చెల్లదు’ (‘తెలంగాణరా’)
పాటను చదివినప్పుడు మాత్రమే కాదు, బృందంగా పాడినప్పుడు కూడా ఆ సామూహిక శక్తి మరింతగా అనుభూతిమయమవుతుంది. విషయాన్ని కవిత్వం చేయాలంటే ఊహకు ఊపిరిలూదాలి. అందుకోసం ఈ పాటకవి మనసులో ‘వచన కవి’గా మారి కవిత్వం రాసి, బయటకొచ్చి బాణీ కట్టి పాటను చేస్తాడు.
చిన్నచిన్న పదాల్లోనే మనసుదోచే భావాలను గుమ్మరిస్తాడు. ఆధునిక మనిషిగా బతుకును కొత్తగా వీక్షిస్తాడు. ఆడబిడ్డపై అసామాన్యమైన అభిమానాన్ని కురిపిస్తాడు. సమస్త ప్రకృతి స్త్రీ శక్తేనంటాడు. మహిళా పక్షపాతాన్ని మన ఒంట్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తాడు. తల్లి కళ్లల్లో కడలిని చూస్తాడు.
ఆడపిల్ల ఎప్పుడూ తలెత్తుకుని బతకాలని ఆకాంక్షిస్తాడు. స్త్రీని సెల్ప్ రెస్పెక్ట్ ప్రతీకగా చూసే ఫెమినిస్ట్ అవుతాడు. ఈ పాటల్లో కొన్ని మనకు కనుమూసిన వీరులను గుర్తు చేస్తాయి. వారి యాదిలో కవిత్వ ప్రవాహమై నివాళి గానమవుతాడు రచయిత. ‘ఎవ్వరే’ పాటలో మారోజు వీరన్న జ్ఞాపకం ఒక నినాదంగా మాత్రమే తిరిగి రాదు. చల్లగాలి తాకే చెమట చుక్కలో, రబ్బరు చెప్పుల నడకలో, నీటి బుగ్గలో, లేగదూడ కేకలో అతని రూపం కనిపిస్తుంది.
ఒక మనిషిని ప్రకృతిలో, రోజువారీ జీవితపు చిన్న కదలికల్లో మళ్లీ గుర్తించగలగడం ఈ పాటలోని కవితా పద్ధతి. ఆర్టిస్ట్ మోహన్ మీద కూడా అద్భుతమైన పాట రాశాడు. ‘ఓ మోహనా!’ పాటలోనూ జ్ఞాపకం నేరుగా వర్ణించబడదు. నవ్వు నదిలా నడవడం, నింగి రెప్పలా వాలడం, ఒక ఈల జోలగా వినిపించడం వంటి దృశ్యాల ద్వారా మనిషి వ్యక్తమవుతాడు.
అలాగే అరుణోదయ రామారావు, చంద్రశ్రీ, కుసుకుర్తి రామలింగం, స్టాన్ స్వామి వంటి నిస్వార్థ జీవుల మీద కూడా పాటల నివాళి అర్పించాడు. వారికి మరణం ఉండొద్దని తండ్లాడుతాడు. అవి అమరులకు గుండెగొంతుకతో చేసే సరికొత్త అక్షరాంజలి.
‘పేగు మండింది’లో ప్రేమకు కులం అడ్డుగోడగా నిలుస్తుంది. ప్రేమించినందుకు మనుషుల ప్రాణాలనే బలితీసుకునే కులాధిపత్యం ఆ పాటలో తన క్రూరమైన ముఖాన్ని చూపిస్తుంది. అక్కడి నుంచి సురేష్ పాటల గొంతు ప్రతిఘటనగా మారుతుంది. ‘జై భీం’, ‘దళితా... దడ దడ లాడించు’, ‘లేలెయ్యర మాదిగన్నా’ పాటల్లో ఆ గొంతు ఒక్కరిది కాదు.
ఒక సమూహానిది, తరతరాలుగా అణచివేతను ఎదుర్కొంటున్న మనుషులది. ముఖ్యంగా ‘లేలెయ్యర మాదిగన్నా’లో తోలు పని, చెప్పులు కుట్టడం, డప్పు తయారీ, దరువు, చిందు ఇవన్నీ వేర్వేరు పనులుగా కనిపించవు. ఒక జాతి జీవితం, దాని శ్రమ, కళ, సంస్కృతి, పోరాటం ఒకే దరువులో కలిసిపోతాయి. తరతరాలుగా అవమానపు ముద్రను మోసిన వృత్తులే ఇక్కడ ఆత్మగౌరవపు చిహ్నాలవుతాయి.
శ్రమను అవమానించిన సమాజం ముందు, ఆ శ్రమలోని సాంస్కృతిక శక్తిని నిలబెట్టడమే ఈ పాటలోని ప్రత్యేకత. అయితే, సురేష్ పాటల్లో దళిత జీవితం కన్నీళ్లతోనే ముగియదు. అక్కడ నవ్వులున్నాయి, ఆటలున్నాయి, పండుగలున్నాయి, ప్రకృతితో కలిసి సాగే జీవన సంబరాలున్నాయి.
‘కిట కిట కిట్టా కిట్టా’లో దళిత బిడ్డ పుట్టుక ఒక పండుగై పలకరిస్తుంది. ‘చిమ్మ చిమ్మ చెమ్మల్లో’ వానతోపాటు ఆటా, పాటా, చిందూ కదం తొక్కుతాయి. ‘చిర్రా చిటికెనల’లో ప్రకృతి జీవుల కదలికల్లోనే ధైర్యం, ఐక్యత, ప్రతిఘటనల జాడలు కనిపిస్తాయి. అణచివేతకు గురైన జీవితాన్ని కేవలం విషాదంగా కాకుండా, నవ్వగలిగే, ఆడగలిగే, కలలు కనగలిగే సంపూర్ణ మానవ జీవితంగా చూడటం ఈ పాటలలోని మరో సౌందర్యం.
మనుషులు దూరమైనా జ్ఞాపకాలు దూరం కావు. ‘మన జ్ఞాపకాలు’లో వెళ్లిపోయిన మనుషులు ప్రకృతిలో, శ్వాసలో, స్పర్శలో మళ్లీ మనల్ని తాకుతారు. ‘ఎర్రమల్లె’లో రాలిపోయిన పూలు కేవలం గతానికి గుర్తులుగా మిగిలిపోవు. అవి వనం మళ్లీ పూయాలనే ఆశను మొలకెత్తిస్తాయి.
అలా సురేష్ పాటల్లో కన్నీరు జ్ఞాపకమవుతుంది, జ్ఞాపకం ఆశగా మారుతుంది, ఆ ఆశ రేపటి జీవితం పట్ల ఒక కలగా విస్తరిస్తుంది. ఏ పాటగాడైనా నిలబడాలంటే, తనదైన బాణి ఉండాలి. తనదైన భాష ఉండాలి. ఈ రెండూ ఈ పాటల్లో ఉన్నాయి. తాను నడిచి వచ్చిన దారుల్లో ఎన్నో ఎర్రెర్రని పాటలను పాడుకున్నాడు.
వాటి శైలిని మాత్రం అనుకరించకుండా కొత్తదారిని వేసుకున్నాడు. తనకు ఈ బాణీ, ఈ శైలి, ఈ కవిత్వ సొగసు ఎట్లా అబ్బిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కవి రాసిన కవిత మీద అతడి పేరు లేకున్నా గుర్తుపట్టడమే అతడి సొంతముద్ర. అట్లాగే సురేష్ పాటలు కూడా అంతే. ఇదే ఈ పాటల విశిష్టత. కళా కవితా సౌందర్యాత్మకత.
‘పాటలో మనిషి’ అనే శీర్షికలోనే ఈ సంపుటి అంతరార్థం ఉంది. మనిషి జీవితంలోని అనుభవాలే కాదు, అతని అస్తిత్వం, ఆత్మగౌరవం, ఆకాంక్షలు కూడా ఈ పాటల్లో ప్రతిధ్వనిస్తాయి. మనిషిని మనిషికి దగ్గర చేసే జీవన స్పర్శ ఈ పాటల సొంతం. లెల్లే సురేష్ కు జేజేలు. జైభీమ్లు. ఈ పాటలకు ఆలింగనాలు.
- డా.పసునూరి రవీందర్, కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమి , యువపురస్కార గ్రహీత
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
