ప్రతిసారి ఒక కొత్త పాఠాన్ని పరుస్తుంది...
ముళ్లను దాటిన పాదముద్రలే
ప్రయాణపు అసలు గురుతులు.
కాలం మనిషికి రోజుల్ని కానుకగా ఇవ్వదు...
ప్రతి అనుభవాన్ని ఒక ఉలిగా మార్చి
వ్యక్తిత్వపు శిలపై అదృశ్య శిల్పాలను చెక్కుతుంది.
కొన్ని పరిచయాలు ఎండిన నేలపై
తొలి వర్షపు సంతకాలు...
కొన్ని ఎడబాట్లు విరిగిన రెక్కల్లో
మిగిలిన ఆకాశపు జ్ఞాపకాలు...
ఒకరి ఆకలిలో మన అరచేతి
అన్నమై మొలకెత్తినప్పుడు
మానవత్వం తన మూలాలను
మరో హృదయంలోకి విస్తరిస్తుంది.
గాయాలన్నీ శరీరానికే పరిమితం కావు
కొన్ని గుండెలో కాలగణనను మార్చుతాయి
కొన్ని కన్నీటి చుక్కలు అంతరంగపు అద్దంపై
కొత్త సన్నివేశాలను ఆవిష్కరిస్తాయి.
జీవితం ఒకే రంగులో
పూర్తయ్యే చిత్రపటం కాదని
రాలిపోయిన రంగుల మధ్యనే
కొత్త వెలుగుల వర్ణమాల పుడుతుందని
ప్రతి ఋతువు తనదైన శైలిలో చెబుతుంది.
ఎత్తుకు ఎదిగిన కొమ్మ
తన వేర్లలోని చీకటిని మరచిపోకూడదు
ఫలభారంతో వంగిన వృక్షమే
పరిపక్వతకు ప్రకృతి రాసిన నిర్వచనం.
చివరికి...
మనిషి వెంట తీసుకెళ్లేది
సంపాదించిన సంపదల నీడల్ని కాదు
తన వల్ల మరొకరి కళ్లలో
వెలిగిన ఆశాదీపాల ప్రతిబింబాల్ని.
కాలం లెక్కించే జీవితానికి
పుట్టుక.. మరణం.. హద్దులు!
కానీ ఒక హృదయం పంచిన ప్రేమ
మరో హృదయంలో వెలిగే అస్తిత్వమై
కాలపు సరిహద్దుల్ని దాటి
కొత్త తరాలకు వారసత్వమవుతుంది.
బతుకు ఒక ఉనికి మాత్రమే...
పరుల మనసులో తన మానవీయతకు
మొలకలు వేయించగలగడమే
మనిషి కాలానికి అందించే
అత్యంత విలువైన సంతకం!
- కొలిపాక శ్రీనివాస్
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
