- హాకీ సిరీస్ భారత్ కైవసం..న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ 'డ్రా'
ఆక్లాండ్: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ‘సెంచరీ ఆఫ్ స్పోర్టింగ్ యూనిటీ’ హాకీ సిరీస్‌ను భారత పురుషుల జట్టు 1-0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో, ఆఖరి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్, సిరీస్‌లో అజేయంగా నిలిచింది. ఈ నెల 19న జరిగిన తొలి మ్యాచ్‌లో 3-2తో గెలిచిన టీమిండియా, తర్వాతి రెండు మ్యాచ్‌లను 2-2తో డ్రాగా ముగించింది. ఉత్కంఠభరితంగా సాగిన మూడో మ్యాచ్‌లో 9వ నిమిషంలో డైలాన్ థామస్ (పెనాల్టీ కార్నర్) గోల్‌తో కివీస్ ఆధిక్యంలోకి వెళ్లింది.
వెంటనే పుంజుకున్న భారత్.. 16వ నిమిషంలో కెప్టెన్ సంజయ్ (పెనాల్టీ కార్నర్), 18వ నిమిషంలో కార్తీ సెల్వం (ఫీల్డ్ గోల్) సాధించిన గోల్స్‌తో 2-1 ఆధిక్యం సంపాదించింది. అయితే, 55వ నిమిషంలో బెంజీ కుల్హేన్ ఫీల్డ్ గోల్‌తో న్యూజిలాండ్ స్కోరును 2-2తో సమం చేసింది. చివరి నిమిషాల్లో ఇరు జట్లు విన్నింగ్ గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 1926లో దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌తో కూడిన భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సిరీస్ నిర్వహించారు.
