భూమికి మనిషి అక్కర్లేదు... మనిషికే భూమి కావాలి!

భూమికి మనిషి అక్కర్లేదు... మనిషికే  భూమి కావాలి!

భూమిని కాపాడండి!  ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సదస్సుల నుండి పాఠశాల గోడల వరకు మనకు నిత్యం వినిపించే, కనిపించే అత్యంత ఆకర్షణీయమైన నినాదమిది. ఈ వాక్యాన్ని పలికిన ప్రతిసారి మనిషి తనను తాను ఒక గొప్ప రక్షకుడిగా, భూమిని ఒక నిస్సహాయురాలిగా ఊహించుకుంటాడు. తన మేధస్సుతో, సాంకేతికతతో ఏదో ఒకరోజు ఈ భూగోళాన్ని ఉద్ధరిస్తాననే ఒక అదృశ్య అహంకారం ఆ నినాదంలో దాగి ఉంది. 

కానీ, విశ్వ చరిత్ర పుటలను ఒక్కసారి నిష్పక్షపాతంగా తిరగేస్తే... మన అహంకారాన్ని బద్దలు కొట్టే ఒక కఠిన సత్యం కళ్లముందు నిలుస్తుంది. అదేమిటంటే.. భూమికి మనిషి అవసరం ఎంతమాత్రం లేదు మనిషికే భూమి అత్యవసరం.

450 కోట్ల ఏళ్ల ప్రస్థానంలో మనిషి ఎక్కడ?

ఈ భూగోళం వయసు సుమారు 450 కోట్ల సంవత్సరాలు. ఆ సుదీర్ఘ కాలయానాన్ని మనం ఒక 24 గంటల గడియారంగా ఊహించుకుంటే, అందులో 'హోమో సేపియన్స్' (ఆధునిక మానవుడు) అడుగుపెట్టింది కేవలం రాత్రి 11 గంటల 59 నిమిషాల 58 సెకన్ల వద్ద మాత్రమే! అంటే, ఈ భూమి చరిత్రలో మనిషి ఉనికి కేవలం రెండు సెకన్ల పాటు మెరిసిన ఒక చిన్న మెరుపు మాత్రమే. 

మనిషి రాకముందే ఈ నేలపై కోట్లాది జీవరాశులు పుట్టాయి, మహా సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. భూమిని శాసించిన మహాకాయులు 'డైనోసార్లు' సైతం ప్రకృతి మార్పుల ముందు తలవంచి కనుమరుగయ్యాయి. అంతటి మహా విలయాలను తట్టుకుని, తనను తాను పునర్నిర్మించుకున్న ఈ వసుంధరకు నిన్న మొన్న వచ్చిన మనిషి చేసే గాయాలు ఒక లెక్కలోనివా?

ప్రతీకారం కాదు... అది ప్రకృతి సహజ ధర్మం!

ఎక్కడైనా కుంభవృష్టి కురిసి నగరాలు నీట మునిగినా, కార్చిచ్చులు అడవులను దహించి
వేసినా, సునామీలు తీరాలను తుడిచిపెట్టినా మనం వెంటనే "ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటోంది" అంటాం. కానీ ప్రకృతికి కోపతాపాలు, కక్షలు ఉండవు. 'ప్రతీకారం' అనేది కేవలం మానవ మనస్తత్వానికి సంబంధించిన బలహీనత మాత్రమే.

 ప్రకృతికి తెలిసిందల్లా ఒకటే.. ‘సమతుల్యత’.

శరీరంలోకి ఏదైనా విషపూరితమైన వైరస్ ప్రవేశించినప్పుడు, శరీరం తన ఉష్ణోగ్రతను పెంచుకుని (జ్వరం రూపంలో) ఆ వైరస్‌ను నశింపజేసి తనను తాను రక్షించుకుంటుంది. నేడు భూమి చేస్తున్నది కూడా సరిగ్గా అదే! అడవులను నరికి, నదులను విషతుల్యం చేసి, వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలను వదులుతూ భూమికి 'జ్వరం' (Global Warming) తెప్పిస్తున్నది మనిషే. ఆ వేడిని తగ్గించుకుని, తిరిగి సమతుల్యతను సాధించడానికి ప్రకృతి తన 'రీసెట్ బటన్' (Reset Button) నొక్కుతోంది. ఆ ప్రక్రియలో కనుమరుగయ్యేది భూమి కాదు.. ఆ వేడిని తట్టుకోలేని మనిషి జాతి మాత్రమే.

నిజమైన ప్రమాదం ఎవరికి?

మనం ప్లాస్టిక్ వాడినా, అడవులను నాశనం చేసినా, ఓజోన్ పొరను ఛిద్రం చేసినా అంతిమంగా మనం నాశనం చేస్తున్నది భూమిని కాదు, మన భవిష్యత్ తరాల మనుగడను.ప్రకృతి ఎప్పుడూ తన అస్తిత్వాన్ని కోల్పోదు. ఒక జీవజాతి తన పరిమితులను దాటి ప్రకృతికి భారంగా మారినప్పుడల్లా, ప్రకృతి ఆ జాతిని తొలగించి కొత్త జీవవైవిధ్యానికి దారి ఇస్తుంది. 

ఇది జీవపరిణామ క్రమంలో ఎన్నోసార్లు నిరూపితమైన సత్యం.కాబట్టి ‘మేం భూమిని రక్షిస్తున్నాం’ అనే భ్రమలో నుండి మనిషి ముందుగా బయటకురావాలి. మనం చెట్లు నాటినా, కాలుష్యాన్ని తగ్గించినా, నదులను కాపాడినా.. అది భూమి మీద మనం చూపిస్తున్న దయ కాదు మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే.

 ప్రకృతితో మనిషి చేసేది యుద్ధం కాదు ఎందుకంటే యుద్ధంలో గెలిచే అవకాశం ఇద్దరికీ ఉంటుంది. కానీ ప్రకృతితో పోరాడితే ఓడిపోయేది ఎప్పుడూ మనిషే. అందుకే, ప్రకృతిని జయించాలనే మూర్ఖపు ఆలోచనను వదిలి, దానితో కలిసి నడిచే వివేకాన్ని మనిషి అలవర్చుకోవాలి. లేదంటే 450 కోట్ల ఏళ్ల భూమి చరిత్రలో మనిషి కూడా ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు!

కొన్ని వారాల్లోనే కాలుష్య పొగలు మాయమై ఆకాశం నిర్మలమైన నీలిరంగులోకి మారుతుంది. నదులు, సముద్రాలు తమ సహజ స్వచ్ఛతను తిరిగి పొందుతాయి. మనం నిర్మించుకున్న కాంక్రీట్ అడవుల గోడలను చీల్చుకుంటూ మొక్కలు మొలుస్తాయి. వందేళ్లలో మనం గర్వంగా చెప్పుకునే మహా నగరాలు పచ్చని అరణ్యాలుగా మారిపోతాయి. 

వన్యప్రాణులు నిర్భయంగా వీధుల్లో విహరిస్తాయి. కొన్ని వేల ఏళ్ల తర్వాత, ఈ భూమి మీద 'మనిషి' అనే ఒక జీవి బతికాడన్న ఆనవాళ్లు కూడా లేకుండా ప్రకృతి తనను తాను పూర్తిగా శుభ్రపరుచుకుంటుంది. అంటే, మనిషి లేకపోతే  భూమికి వచ్చే నష్టం ఏమీ లేదు. పైగా అది మరింత ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.

- కాదాసి అమరేందర్ -

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.