90స్ కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ ఈజ్ బ్యాక్.. 26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి గోల్డ్ స్పాట్ వచ్చేస్తోంది!

90స్ కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ ఈజ్ బ్యాక్.. 26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి గోల్డ్ స్పాట్ వచ్చేస్తోంది!

90వ దశకంలో భారతీయ మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన 'గోల్డ్ స్పాట్' కూల్ డ్రింక్ సుమారు 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. 'ది జింగ్ థింగ్' అనే ట్యాగ్‌లైన్‌తో ఒకప్పుడు పిల్లలు, యువతకు ఎంతో ఇష్టమైన ఈ ఆరెంజ్ ఫిజీ డ్రింక్ వచ్చే వారమే దుకాణాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

అయితే ఈసారి గోల్డ్ స్పాట్ సరికొత్త అవతారంలో రాబోతోంది. ప్రస్తుతం వినియోగదారులలో ఆరోగ్య స్పృహ పెరగడం, చక్కెర తక్కువగా ఉన్న డ్రింక్స్ కి డిమాండ్ ఉండటంతో.. ఈ డ్రింక్‌ను 'లో-షుగర్', 'నో-షుగర్' వేరియంట్లలో తీసుకువస్తోంది కోకాకోలా. తద్వారా కోకాకోలాకు చెందిన మరో ఆరెంజ్ డ్రింక్ 'ఫాంటా' అమ్మకాలపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి సోషల్ మీడియాలో గోల్డ్ స్పాట్ క్యాన్లతో కనిపించడం ఈ రీ-లాంచ్ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.

1977లో కోకాకోలా భారత మార్కెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత.. పార్లే బిస్లరీ యజమాని థమ్స్ అప్, లిమ్కాతో పాటు గోల్డ్ స్పాట్‌ను ప్రారంభించారు. పుట్టినరోజు వేడుకలు, వేసవి సెలవుల్లో ఇది అప్పట్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1993లో కోకాకోలా సంస్థ 40 మిలియన్ డాలర్లకు థమ్స్ అప్, లిమ్కా, మాజా, గోల్డ్ స్పాట్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. అయితే తన సొంత బ్రాండ్ 'ఫాంటా'ను ప్రమోట్ చేసేందుకు కోకాకోలా అప్పట్లో గోల్డ్ స్పాట్‌ని నిలిపివేసింది.

ALSO READ : బిస్లరీ బాటిల్ వాటర్ ఎంతో సురక్షితం

ఇప్పుడు మారుతున్న మార్కెట్ పోటీని తట్టుకునేందుకు పాత బ్రాండ్లకు మళ్లీ ప్రాణం పోస్తున్నారు. సరైన డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వ్యూహాలతో గోల్డ్ స్పాట్ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.