AI వల్ల కంపెనీలు లక్షల కోట్లు అప్పు చేస్తాయి: ఎలన్ మస్క్ వార్నింగ్

AI వల్ల కంపెనీలు లక్షల కోట్లు అప్పు చేస్తాయి: ఎలన్ మస్క్ వార్నింగ్

AI రంగంలో ప్రస్తుతం జరుగుతున్న పోటీ.. వచ్చే ఏడాది టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెడుతుందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్స్‌ను రూపొందించడానికి అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని నిర్మించే క్రమంలో.. కంపెనీలకు ఊహించని స్థాయిలో డబ్బు కొరత ఏర్పడుతుందని అన్నారు మస్క్. ఏఐ రీసెర్చర్ ఫ్రాంకోయిస్ చోలెట్ ఎక్స్ పోస్టుకు స్పందిస్తూ మస్క్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారీ స్థాయిలో కంప్యూటింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయడం, వాటికి నిరంతర కరెంట్, కూలింగ్ వ్యవస్థలను సమకూర్చడం అత్యంత కష్టతరమైన పని అని మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు డేటా సెంటర్లు, ఎన్విడియా జీపీయూ చిప్‌ల కోసం బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. 2029 వరకు HBM, DRAM మెమరీ చిప్‌ల ఉత్పత్తి ఇప్పటికే బుక్ అయిపోయిందని.. ఏఐ డిమాండ్‌కు ఇది నిదర్శనమని చోలెట్ పేర్కొన్నారు.

అయితే ఈ భారీ పెట్టుబడుల వెనుక ఉన్న ఆర్థిక భారాన్ని మస్క్ ఎత్తిచూపారు. చిప్‌ల కొనుగోలు, డేటా సెంటర్ల నిర్మాణానికి ముందే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, కానీ వాటి ద్వారా ఆదాయం రావడానికి సమయం పడుతుందని వివరించారు. ఈ ప్రక్రియలో ఎక్కడ ఎలాంటి ఆలస్యం జరిగినా.. వర్కింగ్ క్యాపిటల్ కోసమే వందల బిలియన్ల డాలర్ల అదనపు నిధులు అవసరమవుతాయని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ : రెక్కలు లేకుండానే గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..

అంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంటూ మస్క్ వేసిన ప్రశ్న ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఏఐ రేసులో ముందుండాలనే తపనతో కంపెనీలు చేస్తున్న విపరీతమైన ఖర్చు, భవిష్యత్తులో వాటిని తీవ్రమైన డబ్బు కష్టాల్లోకి నెట్టే ప్రమాదం ఉందని మస్క్ వేస్తున్న అంచనాలు ఏఐ రంగంలోని కంపెనీలను ఆలోచింపజేయటంతో పాటు ఆందోళనకు గురిచేస్తోంది.