ఐఐటీ బాంబేలో చదివి, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించినా.. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కేవలం 6 నెలల్లోనే ఆ కంపెనీ మూతపడటంతో ఉద్యోగం కోల్పోయిన ఓ టెక్కీ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కెరీర్ లో తనకు ఎదురైన ఇబ్బందులను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
సోహమ్ నాయక్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ ఏడాది ఐఐటీ బాంబే నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. చదువుకునే సమయంలోనే ఆయన వై కాంబినేటర్ బ్యాక్డ్ స్టార్టప్స్‌లో ఇంటర్న్‌షిప్‌లు చేశారు. తన నైపుణ్యంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి రూ. 23 లక్షల ప్యాకేజీతో ఒక టెక్ కంపెనీలో ఉద్యోగం సాధించారు. అయితే విధి ఆయన్ను మరోలా పరీక్షించింది.
తన వృత్తిపరమైన ప్రయాణం గురించి సోహమ్ వివరిస్తూ.. "ప్లేస్‌మెంట్స్‌లో రూ. 23 లక్షల ప్యాకేజీతో టెక్ జాబ్ వచ్చింది. నా చివరి సెమిస్టర్లో 4 నెలలు పార్ట్ టైమ్‌గా.. ఆ తర్వాత 2 నెలలు ఫుల్ టైమ్‌గా పనిచేశాను. కానీ దురదృష్టవశాత్తూ ఆ కంపెనీ మూతపడింది" అని పేర్కొన్నారు. ఉద్యోగం పోవడంతో నిరాశ చెందకుండా.. ఆదాయం కోసం ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నారు.
ప్రస్తుతం సోహమ్ సొంతంగా కొన్ని ప్రోడక్ట్స్‌ను రూపొందించడంతో పాటు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' ద్వారా పెయిడ్ ప్రమోషన్లు చేస్తున్నారు. వీటి ద్వారా నెలకు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఆదాయంలో ఎక్కువ భాగం ప్రమోషన్ల ద్వారానే వస్తుండగా.. సొంత ప్రోడక్ట్స్ ద్వారా తక్కువ మొత్తమే వస్తోందని చెప్పాడు.
సొంతంగా సంపాదిస్తున్నప్పటికీ.. తన కెరీర్ పొజిషన్ పట్ల కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని సోహమ్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అంటే ఇంతకంటే మెరుగైన స్థాయిలో ఉండాలని ఫ్యామిలీ భావిస్తోంది. వాళ్లు సంతోషంగా లేరు. నేను ఇప్పుడు ఏం చేయాలి?" అంటూ నెటిజన్లను సలహా కోరారు.
సోహమ్ పోస్టుపై పలువురు స్పందిస్తూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 22 ఏళ్ల వయసులో సొంతంగా నెలకు రూ. 60 వేలకు పైగా సంపాదించడం మంచి విషయమేనని కొందరు ప్రశంసించారు. "ఐఐటీ ట్యాగ్, మీకున్న నైపుణ్యం వృథాగా పోవు. సొంతంగా స్టార్టప్ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఇన్వెస్టర్లను సంప్రదించండి, ఒకవేళ విఫలమైనా ఆ అనుభవం మీ రెజ్యూమ్‌కి ప్లస్ అవుతుంది" అని మరికొందరు సూచించారు.
కుటుంబ సభ్యుల ఒత్తిడికి లొంగిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, నిలకడగా ప్రయత్నిస్తే ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్ కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని నెటిజన్లు ధైర్యం చెప్పారు. వృత్తిపరమైన జీవితం ఇప్పుడే మొదలైందని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని చాలా మంది సూచించారు.
