సోమవారం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. జనం పెట్టుబడులను ఎందుకు అమ్మేస్తున్నారు?

సోమవారం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. జనం పెట్టుబడులను ఎందుకు అమ్మేస్తున్నారు?

సోమవారం ఉదయం లాభాలతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. గడచిన కొన్ని రోజులుగా అంతర్జాతీయ కారణాలతో పాటు ఏఐ షేర్లలో పెరిగిన అమ్మకాల ఒత్తిడితో ఆ డబ్బు అభివృద్ధి చెందుతున్న ఇండియన్ మార్కెట్లలో కూడా పార్క్ అయ్యింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటమే ప్రధాన కారణం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 629 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 196 పాయింట్లు నష్టంలో ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 1270 పాయింట్ల భారీ నష్టంలో కొనసాగుతుండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 403 పాయింట్లు నష్టంతో ముందుకు సాగుతోంది. సూచీలు ఓవర్‌బాట్ జోన్‌లో ఉండటం వల్ల మధ్యమధ్యలో ఇలాంటి ప్రాఫిట్ బుక్కింగ్స్, కన్సాలిడేషన్ సహజమని ఛాయిస్ బ్రోకింగ్ విశ్లేషకుడు హితేష్ టైలర్ పేర్కొన్నారు.

నవంబర్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు(FIIs) భారత స్టాక్ మార్కెట్లలో రికార్డు స్థాయిలో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది మొత్తం మీద విదేశీ నిధుల ఉపసంహరణ 18.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లలో AI షేర్లలో విపరీతమైన రద్దీ, ఒడిదొడుకులు నెలకొన్న నేపథ్యంలో.. లిస్టెడ్ స్పేస్‌లో AI ప్రభావం తక్కువగా ఉన్న భారత మార్కెట్లను విదేశీ ఇన్వెస్టర్లు సురక్షితమైన డైవర్సిఫికేషన్ కేంద్రంగా ఎంచుకుంటున్నారు. దీనికి తోడు కార్పొరేట్ ఆదాయాల గ్రోత్ పుంజుకోవడం, దేశీయ ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండటం కూడా ఈ ర్యాలీకి ప్రధాన బలాన్నిచ్చాయి.

ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు
అమెరికా మార్కెట్లలో శుక్రవారం నాటి భారీ నష్టాల ప్రభావం ఆసియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. నాస్‌డాక్ కాంపోజిట్ 5% పైగా పతనమవడంతో పాటు ఎస్&పీ 500 టెక్నికల్ కరెక్షన్‌లోకి జారుకుంది. దీని ప్రభావంతో దక్షిణ కొరియా బెంచ్‌మార్క్ 'కోస్పి' ఏకంగా 5.5% వరకు పడిపోయింది. ఈ క్రమంలో ఎస్‌కే హైనిక్స్ 16%, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ 5% మేర నష్టపోయాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ సూచీ వరుసగా 5వ రోజూ నష్టపోయి 1% పైగా క్షీణించగా.. చైనా మార్కెట్లు కూడా 1% పైగా నష్టపోయాయి. ఇండోనేషియా సూచీ 6వ రోజూ నష్టాల్లో కొనసాగగా, ఆస్ట్రేలియా మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. AI ట్రేడ్‌పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఇంకా బలహీనంగానే ఉందని ఈ పరిస్థితులు సూచిస్తున్నాయి.