న్యూఢిల్లీ: దేశంలోని 7 ప్రధాన ఆయిల్, నేచురల్ గ్యాస్ ఫీల్డ్స్‌కు సంబంధించిన ప్రీ–న్యూ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ (ప్రీఎన్‌ఈఎల్‌పీ) కాంట్రాక్టు పొడిగింపు విధానాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ సవరించింది. దీని ప్రకారం, ఫీల్డ్స్‌లో చమురు నిల్వలు ఉన్నంత కాలం (ఒక్కో విడతలో 30 ఏళ్ల వరకు) కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అయితే, అందుకు బదులుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లాభాల వాటాను పెంచడంతో పాటు కఠిన నిబంధనలను కేంద్రం విధించింది.
అంటే పొడిగించిన కాంట్రాక్టు కాలంలో మొదటి 10 ఏళ్లు సాధారణం కంటే 10శాతం అదనపు లాభాల వాటా, తర్వాతి 10 ఏళ్లు 5శాతం అదనంగా, ఆ తర్వాత 10 ఏళ్లు 2.5శాతం అదనంగా ప్రభుత్వానికి చెల్లించాలి. రాయల్టీ, సెస్‌లు యథావిధిగా చెల్లించాలి. కాంట్రాక్ట్ పొడిగించుకోవాలనుకుంటే కాలపరిమితి ముగియడానికి కనీసం రెండేళ్ల ముందే దరఖాస్తు చేసుకోవాలి. గత 10 ఏళ్లలో కనీసం 70శాతం బావుల తవ్వకం లేదా 70శాతం ఉత్పత్తి లక్ష్యాలను చేరుకుంటేనే కాంట్రాక్ట్ పొడిగింపు ఉంటుంది. అంతేకాకుండా కంపెనీలు తమ ఏడాది ఖర్చులో 10శాతం బ్యాంక్ గ్యారంటీగా ఇవ్వాలి.
రాజస్థాన్‌లోని ఆర్‌జేఓఎన్-90/1, ఎస్‌జీఎల్, అస్సాం-–మిజోరంలోని డిరోక్, ఏఏఓఎన్‌జే/2, గుజరాత్‌లోని తారాపూర్, పలేజ్, సీబీఓఎన్/3 బ్లాక్‌లకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. రూల్స్ పాటించకపోతే వాటిని తిరిగి వేలం వేయడం లేదా ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
