ఒలింపిక్స్ బిడ్డింగే టార్గెట్..భవిష్యత్ ఒలింపిక్స్కు రిహార్సల్గా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026

ఒలింపిక్స్ బిడ్డింగే టార్గెట్..భవిష్యత్ ఒలింపిక్స్కు రిహార్సల్గా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026
  • 6 నగరాలు.. 20 వేదికలు.. 7 వేల మంది అథ్లెట్లు
  • ప్రపంచ క్రీడల నిర్వహణ సత్తాను చాటేలా ఏర్పాట్లు 
  • రూ.224.3 కోట్ల బడ్జెట్.. శాశ్వత ఆస్తులకే ప్రాధాన్యం 

హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో ‘ఒలింపిక్స్’ను భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించేందుకు అవసరమైన అంతర్జాతీయ స్థాయి బిడ్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచ స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చే మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యం రాష్ట్రానికి ఉన్నాయని గ్లోబల్ వేదికపై నిరూపించేందుకు ‘8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)-2026’ను ట్రయల్ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మలచుకుంటోంది.

 డిసెంబర్ 11 నుంచి 22 వరకు మొత్తం 12 రోజుల పాటు రాష్ట్రంలోని 6 ప్రధాన నగరాలు, 20 అత్యాధునిక వేదికల్లో జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా అండర్-18 యువ క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు 2 వేల మందికి పైగా సహాయక సిబ్బంది, సాంకేతిక నిపుణులు, 6 వేల మంది వలంటీర్లు భాగస్వాములు కానున్నారు. 

ఈ క్రీడల గుర్తింపుగా రూపొందించిన మస్కట్, లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాకతీయ కళాతోరణం, తంగేడు పువ్వు, చార్మినార్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తూ ‘ఖేల్ కా జునూన్.. తెలంగాణ కి జాన్ ఔర్ పెహచాన్’ అనే  నినాదంతో లోగోను తీర్చిదిద్దారు.

హైదరాబాద్ మెట్రో పరిధిలో 15 ప్రధాన వేదికలు

రాష్ట్రంలోని మొత్తం 6 ప్రధాన నగరాల్లోని 20 అత్యాధునిక వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ మెట్రో పరిధిలో 15 ప్రధాన వేదికలు ఉండగా, జిల్లాల్లోని క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు మరో 5 జిల్లాల వేదికలను ఎంపిక చేశారు. హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో అథ్లెటిక్స్, కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జూడో, ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్చరీ  పోటీలు నిర్వహించనున్నారు.

 మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ వేదికగా టేబుల్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. మొత్తం 27 అధికారిక క్రీడా విభాగాలు, రెండు డెమో విభాగాలతో కలిపి ఈ గేమ్స్ సాగనున్నాయి. అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్ వంటి 14 వ్యక్తిగత క్రీడలతో పాటు ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్, హాకీ, బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్, వాలీబాల్, ఖో-ఖో వంటి 6 టీమ్ గేమ్స్ ఇందులో ఉన్నాయి. 

వీటితో పాటు భారతీయ సంప్రదాయ యుద్ధ విద్యలు, క్రీడలైన మల్లఖంబ్, కలరిపయట్టు, యోగాసన, థాంగ్-టా, గట్కా పోటీలను  నిర్వహిస్తున్నారు. ఆతిథ్య రాష్ట్ర హోదాలో ప్రభుత్వం ‘రోయింగ్’ క్రీడను ప్రత్యేకంగా ఎంపిక చేయగా, ఈ ఎడిషన్ ఫీచర్డ్ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్’ను చేర్చారు. వీటికి అదనంగా సెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్రసామును నిర్వహిస్తున్నారు.  

మైదానాల నవీకరణ.. పరికరాల కొనుగోలు

ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.224.3 కోట్ల భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటాయించింది. ఇందులో కేంద్రం ఖేలో ఇండియా కింద రూ.21.17 కోట్ల ఆర్థిక సాయం అందిస్తుండగా, మిగిలిన రూ.203.1 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. మొత్తం బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 54 శాతం నిధులను రూ.120.3 కోట్లు  క్రీడా మైదానాల నవీకరణ, అంతర్జాతీయ స్థాయి పరికరాల కొనుగోలు కోసమే కేటాయించారు. 

గత ఆతిథ్య రాష్ట్రాలతో పోలిస్తే ప్రారంభ, ముగింపు వేడుకల ఖర్చులను ఏకంగా 97 శాతం తగ్గించి కేవలం రూ.60 లక్షలకే పరిమితం చేశారు. అలంకరణలు, ప్రచార ఖర్చుల్లో 33 శాతం, వసతి-రవాణా ఖర్చుల్లో 34 శాతం మేర ఆదా చేసినట్లు పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం ఏర్పాటు చేస్తున్న 20 వేదికల ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

వేదికల శాశ్వత రిపేర్లు, గ్రౌండ్ల అభివృద్ధి కోసం రూ.60.30 కోట్లు, 27 క్రీడలకు అవసరమైన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సేకరణకు మరో రూ.60 కోట్లు వెచ్చిస్తున్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, గచ్చిబౌలి ఆక్వాటిక్ కాంప్లెక్స్, జీఎంసీ బాలయోగి మెయిన్ స్టేడియం, సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, ఎల్బీ స్టేడియం, కోటి వీపీజీ గ్రౌండ్స్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీయూ షూటింగ్ రేంజ్, ఓయూ వెలోడ్రోమ్ తదితర కేంద్రాలను పకడ్బందీగా ముస్తాబు చేస్తున్నారు.

 దివ్యాంగ క్రీడాకారుల కోసం ర్యాంపులు, బారియర్-ఫ్రీ యాక్సెస్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. మహిళా అథ్లెట్ల సౌకర్యార్థం ప్రతి వేదిక దగ్గర ప్రత్యేక విశ్రాంతి గదులు, శానిటరీ న్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిన్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేస్తున్నారు.   
 
ఒలంపిక్​నిర్వహణకు తొలిమెట్టుగా.. మెడల్​ స్ట్రాటజీ అమలు చేస్తున్నాం

ఆతిథ్య రాష్ట్రంగా తెలంగాణ క్రీడాకారులు అన్ని విభాగాల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో పక్కా ‘మెడల్ స్ట్రాటజీ’ని రూపొందించి అమలు చేస్తున్నాం. ఇందుకోసం మూడు అంచెల శిక్షణ శిబిరాలతో రాష్ట్ర జట్టును సన్నద్ధం చేస్తున్నాం. తొలుత లెవెల్-1 క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 27 క్రీడల నుంచి 1,334 మంది క్రీడాకారులను ఎంపిక చేశాం. ఆ తర్వాత లెవెల్-2లో వారి ప్రతిభను వడపోసి 1,079 మందికి కఠిన శిక్షణ ఇచ్చాం. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 527 మందితో తుది ‘టీమ్ తెలంగాణ’ బృందాన్ని సిద్ధం చేశాం. 

మన అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి తర్ఫీదునిచ్చేందుకు బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, టేబుల్ టెన్నిస్ గురువు సోమనాథ్ ఘోష్, ఆర్చరీ కోచ్ క్రాంతి కుమార్, కబడ్డీ నిపుణురాలు నీతా దాడ్వే వంటి దిగ్గజాలను రంగంలోకి దించాం. ఖేలో ఇండియా క్రీడల నేపథ్యంలో క్రీడా స్ఫూర్తిని నలుమూలలా చాటేందుకు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా జ్యోతి యాత్ర నిర్వహించనున్నాం.

‌‌‌‌ - వాణీ ప్రసాద్, స్పెషల్ సీఎస్, క్రీడా శాఖ -