కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి ఆవిర్భావ వేడుకలను డిసెంబర్ 23న ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం రూ.36,61,350 కేటాయించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సెంట్రల్ఫంక్షన్, సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా సంస్థ ప్రగతిని వివరించే స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. బెస్ట్సేవా మెంబర్, బెస్ట్మహిళా, పురుష ఉద్యోగులు, దీపాలంకరణ, బెస్ట్ ఎన్విరాన్మెంట్హౌస్లు, ఇతర వ్యాపకాలకు క్యాష్‌ప్రైజ్‌లను అందజేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం-1, మందమర్రి, శ్రీరాంపూర్, సత్తుపల్లి ఏరియాలకు వేడుకల కోసం రూ.3,46,500 చొప్పున కేటాయించారు. ఇల్లందు, బెల్లంపల్లి ఏరియాలకు రూ.2,31,000 చొప్పున, రామగుండం-2, రామగుండం-3, అడ్రియాల ఏరియాలకు రూ.2,88,750 చొప్పున బడ్జెట్ కేటాయించారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, ఒడిశాలోని నైనీ ఏరియాకు రూ.69,300 చొప్పున, హైదరాబాద్ ఆఫీస్‌లో వేడుకలకు రూ.57,750 కేటాయించారు. అన్ని ఏరియాల్లో డిసెంబర్ 23న ఆవిర్భావ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని యాజమాన్యం ఆఫీసర్లను ఆదేశించింది.
