న్యూఢిల్లీ: మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీపతూన్ (రాతి స్తంభం) వద్ద ఈ నెల 24న దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈ పిటిషన్ వేశారు. దీపతూన్ వద్ద ఈ నెల 24న దీపం వెలిగించేందుకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలితో కూడిన బెంచ్ శుక్రవారం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే పాల్గొనాలని, సామాన్యులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది. ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, నినాదాలు, నిరసనలు చేపట్టరాదని షరతులు విధించింది.
