ఖమ్మం టౌన్, వెలుగు : తెలుగు కథ విశ్వజనీనమైనదని, విలక్షణమైన జీవన వాస్తవికతకు దర్పణంగా నిలుస్తుందని ప్రముఖ కథా విశ్లేషకులు ఏ.వి. రమణమూర్తి అన్నారు. ఖమ్మం నగరంలోని సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ‘ఆరు జతల కథలు’ తులనాత్మక పరిశీలన, ‘కథాంతరంగం-2026’ కార్యక్రమం ముగిసింది. 36 మంది కథకులు, ఆరుగురు విశ్లేషకులు ఆరు సెషన్లలో ప్రముఖ కథలపై విశ్లేషణ నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన ఈస్తటిక్స్ పురస్కారాల వేడుకకు ప్రముఖ కథకులు జి. వెంకటకృష్ణ, బి.వి.ఎన్. స్వామి, ఎల్.ఎస్.ఆర్. ప్రసాద్, శ్రీ ఊహ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 14 కథలతో రూపొందించిన ‘ఈస్తటిక్స్-2026’ కథా సంకలనాన్ని రవిమారుత్, ప్రసేన్, మువ్వా శ్రీనివాసరావు, సీతారాం, వంశీకృష్ణ, ఫణి మాధవి కన్నోజు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కథల విభాగంలో ప్రథమ బహుమతి బి. నాగశేషు అందుకోగా, కవిత్వ విభాగంలో నాగ్ జ్యోతి శేఖర్ రచించిన ‘చిగురించే పేజీలు’ కవితా సంపుటికి పురస్కారం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కథకులు, కవులు వివిధ విభాగాల్లో పురస్కారాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి, డాక్టర్ ఆనందవాణి, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ నాగమణి, ధరణికోట రమేశ్‌కుమార్, సంధ్యారాణితో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.
