- ఏదులాపురంలో ఘటన
ఖమ్మం రూరల్, వెలుగు: హైట్ పెరగడం లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవారినగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 7వ డివిజన్‌కు చెందిన దేవరకొండ వేణుగోపాలాచారి కొడుకు విష్ణువర్ధనాచారి (19) ఖమ్మం సిటీలోని ఓ కాలేజ్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎత్తు నాలుగు అడుగులే ఉండడంతోపాటు చదువులో కూడా వెనుకబడ్డాడు.
ఎత్తు విషయమై తరచూ మనస్తాపానికి గురయ్యేవాడని, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవాడని మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వేణుగోపాలాచారి అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లి రాగా, తలుపులు మూసి ఉన్నాయి. దీంతో తలుపులు విరగ్గొట్టి చూడగా విష్ణువర్ధనాచారి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
