రాహుల్‌‌‌‌ ను ప్రధానిని చేయడమే లక్ష్యం..దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌‌‌ ను బలోపేతం చేయాలి

రాహుల్‌‌‌‌ ను ప్రధానిని  చేయడమే లక్ష్యం..దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌‌‌ ను బలోపేతం చేయాలి
  • ఐకమత్యంతోనే రాష్ట్రంలో 64 సీట్లు గెలిచాం 
  • కేంద్రం సాయం చేయకున్నా కరువును 
  • ఎదుర్కొంటున్నం: ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జి సందీప్ 

 హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మరిన్ని స్థానాలు గెలుచుకుని రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ రాష్ట్ర నూతన ఇన్‌‌‌‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ పిలుపునిచ్చారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులంతా ఐకమత్యంతో పనిచేయడం వల్లే 64 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చామని, ఇదే ఐక్యతను కొనసాగించాలని అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, సీనియర్ నాయకుల సమక్షంలో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశాలు జరిగాయి. 

ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కరవును ఎదుర్కొంటూ ప్రజల అవసరాలు తీరుస్తోందన్నారు. 

బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలను తిప్పికొట్టి దేశంలో కాంగ్రెస్‌‌‌‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్’ పుస్తకానికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత లభించిందని, గాంధీ కుటుంబ త్యాగాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని గుర్తుచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..

 సందీప్ కుమార్‌‌‌‌కు యువజన కాంగ్రెస్, ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ, ప్రభుత్వ సమన్వయ బాధ్యతలను ఆయనకు అప్పగించడం శుభపరిణామమన్నారు. 

గత ఏడాది కాలంగా పార్టీ బలోపేతానికి, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మాజీ ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సేవలను కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోనూ ఉద్యమాలు చేపట్టామన్నారు. సర్ విధానాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ర్యాలీలు నిర్వహించి, ఢిల్లీలోని రామ్‌‌‌‌లీలా మైదాన్ సభకు భారీగా తరలివెళ్లామని చెప్పారు. 

రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్‌‌‌‌లో అంబేద్కర్ విగ్రహం నుంచి నెహ్రూ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ నిర్ణయాలు ఆహార భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. 

కృష్ణా, గోదావరి బేసిన్లలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన జలాశయాలు రైతులకు సాగునీటి భరోసా ఇస్తున్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలు అందించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రాజెక్టును సాంకేతికంగా పునరుద్ధరించేందుకు భారీగా అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.

 కరవు పరిస్థితులతో కొన్ని ప్రాంతాల్లో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నా.. రాబోయే వర్షాకాలం వరకు రాష్ట్రంలో తాగునీటి కొరత రాకుండా అత్యవసర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
 
ఉత్తమన్న దత్తత తీసుకుంటే వెళ్తా.. మహేశ్ గౌడ్ చమత్కారం


పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ ప్రసంగం మధ్యలో సరదా సంభాషణ నవ్వులు పూయించింది. తమది కుటుంబ పార్టీ కాదని, తనకు, సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ వారసులు ఎవరూ లేరని మహేశ్ గౌడ్ అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రాజకీయ వారసులు లేరని, ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. 

ఉత్తమ్, పద్మావతమ్మకు పిల్లలు లేరని, ఉత్తమన్న తనను దత్తత తీసుకుంటే ఆయన దగ్గరికే వెళ్లిపోతానని చమత్కరించారు. దీనికి ఉత్తమ్ స్పందిస్తూ.. తనను దత్తత తీసుకుంటే తనకున్న అప్పులను కూడా భరించాల్సి ఉంటుందని నవ్వుతూ బదులిచ్చారు. 

ఉత్తమన్న అప్పులకు కూడా తాను సిద్ధమేనని మహేశ్ గౌడ్ అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని.. మహేశ్‌‌‌‌తో పాటు రోహిణ్ రెడ్డి, సంపత్ కుమార్ కూడా దత్తత కోసం చూస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించడంతో సమావేశ ప్రాంగణం నవ్వులతో మార్మోగింది.