రెండు ఎమ్మెల్సీ సీట్లలో  గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎన్. రాంచందర్ రావు 

రెండు ఎమ్మెల్సీ సీట్లలో  గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎన్. రాంచందర్ రావు 
  • దేశ ఆర్థిక ప్రగతి వాస్తవాలను మేధావులు, ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వెల్లడి

హైదరాబాద్,వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి సమన్వయం, ఓటర్ల సంపర్కం, కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని సూచించారు.

 ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించిన వాస్తవాలను ప్రజలు, మేధావుల వద్దకు తీసుకెళ్లాలని.. ఇందుకోసం కార్యకర్తలకు పూర్తి డేటా పాయింట్లు అందిస్తామని తెలిపారు. పేదరికం నుంచి 50 కోట్ల మందికి విముక్తిప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని రాంచందర్ రావు అన్నారు. 2014కు ముందు 27.10 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం ఇప్పుడు 2.6 శాతానికి తగ్గిందన్నారు. యూపీఏ హయాంలో 9.49 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.1 శాతానికి దిగివచ్చిందన్నారు. 

రాహుల్ ప్రచారం దురదృష్టకరం

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని గడిచిన దశాబ్దం దేశ ఆర్థిక వ్యవస్థకు ‘గోల్డెన్ డికేడ్’ అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ దేశాల నేతలంతా భారత్ ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తుంటే.. లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం విదేశాల్లో తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.