న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) షాక్ ఇచ్చింది. బిస్లెరీ కంపెనీకి చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్ నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో ఆ సంస్థపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేసింది. నీటి నమూనాలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని ఆహార భద్రతా నియంత్రణ సంస్థ తెలిపింది.
రెండు పరీక్షల్లోనూ అనారోగ్యకరమని నిర్ధారణ
బిస్లెరీ సంస్థ ప్రాంగణం నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలో నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు తొలుత గుర్తించారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం ఆ నమూనాను వినియోగానికి సురక్షితం కానిదిగా ప్రకటించారు.అయితే, ఈ ఫలితాలపై బిస్లెరీ సంస్థ అప్పీల్ చేయడంతో నమూనాను రిఫరల్ ఫుడ్ లేబొరేటరీకి పంపించారు. అక్కడ మరోసారి పరీక్షించగా పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించారు. ఈ పరీక్షలోనూ నీటి నమూనా సురక్షితం కాదని తేలినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.రెండు పరీక్షల ఫలితాల ఆధారంగా ఆహార భద్రతా చట్టంలోని నిబంధనలను బిస్లెరీ ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. దీంతో బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యల్లో భాగంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు.
మరికొన్ని కంపెనీలపైనా చర్యలు
బిస్లెరీతో పాటు వసంత్ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిమాంస ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ వంటి సంస్థలపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతించింది.ఆహార భద్రతా నిబంధనలు పాటించని ఉర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్ఎల్‌పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ సంస్థల లైసెన్స్‌లను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
ఆహార ఉత్పత్తులపై పెరిగిన నిఘా
ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తన తనిఖీలను మరింత ముమ్మరం చేసింది. ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాలిక్ పానీయాల తయారీ సంస్థలపైనా తనిఖీలు పెంచింది.
రెడ్‌బుల్ ఎనర్జీ డ్రింక్ వివాదం
ఎనర్జీ డ్రింక్‌ల వర్గీకరణ విషయంలోనూ ఎఫ్ఎస్ఎస్ఏఐ, పలు కంపెనీల మధ్య వివాదం కొనసాగుతోంది. రెడ్‌బుల్‌ను ఎనర్జీ డ్రింక్‌గా పేర్కొనడంపై జూన్‌లో నియంత్రణ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని పానీయాల్లో అధిక మొత్తంలో చక్కెర ఉండటం వల్ల వినియోగదారులు తప్పుదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.దీంతో రెడ్‌బుల్, పెప్సీకో, మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్ కన్జ్యూమర్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆంక్షలు విధించారని వాదించాయి.ఈ నేపథ్యంలో రెడ్‌బుల్‌కు ఎనర్జీ డ్రింక్ లేబుల్‌ను కొనసాగించేందుకు కోర్టు మధ్యంతర ఊరటనిచ్చింది. అయితే ఇతర కంపెనీలు తమ వద్ద ఉన్న పాత స్టాక్ విక్రయించిన తర్వాత ఆ వర్గీకరణను ఉపయోగించకూడదని ఆదేశించింది.
రెడ్‌బుల్‌కు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించడం వల్ల పోటీ సంస్థలతో పోలిస్తే అన్యాయమైన వాణిజ్య ప్రయోజనం కలుగుతుందని వాదిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ కోర్టు ఆదేశాలను సవాలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరిలో జరగనుంది.
