వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నస్కల్, మల్లెమోనిగూడ గ్రామ శివారుల్లో 4 రోజులుగా చిరుతపులి సంచరిస్తుండటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తొలుత సోలార్ ప్లాంట్ సిబ్బందికి చిరుత కనిపించగా, ఆదివారం నస్కల్ గ్రామానికి చెందిన రైతు కృష్ణ వాగు వద్ద ఎడ్లకు నీళ్లు తాగిస్తుండగా దాడికి యత్నించింది. అతను పరుగెత్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అటవీశాఖ అధికారులకు సమాచారమిస్తే ఆదివారం సెలవంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు చిరుత సంచారాన్ని నిర్ధారించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డీఎఫ్‌వో విశాల్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణమే బోను ఏర్పాటు చేసి, చిరుతను బంధించాలని ఆదేశించారు.
