- మూలాలు మర్చిపోకుండా ప్రపంచంతో పోటీపడాలి
- భారతీయ నాగరికతకు కళలు ప్రతిబింబాలు
- శ్రీరామ నాటక నికేతన్ వజ్రోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఆధునికతను స్వీకరిస్తూనే మన మూలాలను మర్చిపోకుండా ప్రపంచంతో పోటీపడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ‘శ్రీరామ నాటక నికేతన్’ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన సనాతన ధర్మంలో 60 అనే సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉందని, కళాకారుల కృషి, గురువుల అంకితభావం, నిర్వాహకుల పట్టుదలతోనే ఈ సంస్థ ఆరు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నదని కొనియాడారు.
సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం మన నాగరికతకు ప్రతిబింబాలని కిషన్ రెడ్డి అన్నారు. భరతనాట్యం, కూచిపూడి, యక్షగానం, చిందు యక్షగానం, హరికథ, బుర్రకథ వంటి కళారూపాలు సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నాయని, తరతరాలకు విలువలను చేరవేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం మన నిర్మాణ కళా వైభవానికి నిదర్శనమని చెప్పారు. తాను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.26 కోట్లతో హైదరాబాద్లో సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
బడి నుంచే కళలకు ప్రాధాన్యతనివ్వాలి
కళాకారులను గౌరవించుకోవడంలో భాగంగా 2026లో కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డికి, అంతకుముందు 2024లో తెలంగాణ కళాకారులు దాసరి కొండప్ప (బుర్రవీణ), గడ్డం సమ్మయ్య (చిందు యక్షగానం), ఉమా మహేశ్వరి (హరికథ)కి పద్మశ్రీ పురస్కారాలు లభించడం గర్వకారణమన్నారు.
కళలను తదుపరి తరం నేర్చుకోకపోతే ఎన్నో అద్భుత కళారూపాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, అందుకే గురు–శిష్య పరంపరను బలోపేతం చేయాలని వివరించారు. ప్రతి స్కూల్లో భారతీయ కళలకు ప్రాధాన్యమివ్వాలని, పేరెంట్స్ తమ పిల్లలను ప్రాంతీయ కళా ప్రదర్శనలకు తీసుకెళ్తూ మన సంప్రదాయాలను పరిచయం చేయాలని పిలుపునిచ్చారు.
