భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు..నిజరూప దర్శనం కోసం భక్తుల క్యూ

భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు..నిజరూప దర్శనం కోసం భక్తుల క్యూ

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో సుమారు 50 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. అన్నిరకాల టికెట్ల ద్వారా సుమారు రూ.14 లక్షల 33వేల మేర ఆదాయం వచ్చిందన్నారు. భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో కొండగట్టు ఎండోమెంట్ ఆఫీసర్ల సూచనలు మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 11 మంది ఎస్సైలు, 120 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బొజ్జ బోతున్న పార్కింగ్ స్థలం నుంచి గుట్టపై వరకు నేటి ఉదయం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.

భక్తులకు తప్పని తిప్పలు..

కొండగట్టుకు అంచనాలకు మించి భక్తులు వస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వాహనాలను బొజ్జపోతన అవతల పార్కింగ్ స్థలంలో నిలిపి పోలీసులు నిలిపివేయడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన వచ్చి అంజనను దర్శించుకుంటున్నారు. క్యూ లైన్ లు భారీగా నిండిపోవడంతో మహిళలు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. రూ.100, రూ.300 దర్శనం కోసం టికెట్లు ఇచ్చే టికెట్ కౌంటర్ ఒకటే ఉండడంతో భక్తులు ఎగబడ్డారు. భక్తుల కోసం అదనంగా లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏఈవో హరిహరనాధ్, సూపరింటెండెంట్​ సునీల్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.