విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి ..దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు: ఎంపీ వంశీకృష్ణ

విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి ..దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు: ఎంపీ వంశీకృష్ణ
  • ప్రజల మధ్య విద్వేషాలు పెంచే కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలి
  •  బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపు
  • పెద్దపల్లిలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ 
     

పెద్దపల్లి/ మహదేవపూర్, వెలుగు: అధికార దాహంతో కొందరు విభజించు పాలించు విధానాలతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని, వారి కుట్రలను ఐక్యంగా తిప్పి కొట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లిలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. 

ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం.. భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సుల్తానాబాద్‌‌‌‌లో అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌‌‌‌‌‌‌‌లో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. 

ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసి తమ రాజకీయ స్వార్థం కోసం కొందరు సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. దళితులను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

 దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఏ మాత్రం సహించేది లేదని, ఇలాంటి అవమానకర రాజకీయాలను అంబేద్కర్ వాదులు తిప్పి కొట్టాలని సూచించారు. అంబేద్కర్ చూపిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 

నిరుపేద దళితుల కోసం గడ్డం వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ కాలేజీల్లో చదివి ఎంతో మంది మేధావులు అయ్యారని, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ కాలేజీల్లోనే చదివారని ఆయన గుర్తుచేశారు. 

టామ్‌‌‌‌కామ్‌‌‌‌ ద్వారా యువతకు విదేశీ ఉద్యోగాలు

టామ్ కామ్‌‌‌‌ ద్వారా తెలంగాణలోని నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఏటీసీ సెంటర్లలో టాటా గ్రూప్ ద్వారా స్కిల్స్ నేర్పిస్తున్నామని, దానివల్ల ఇక్కడి యువతకు మెరుగైన ఉపాధి లభిస్తుందని చెప్పారు.

 నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను విభజిస్తూ ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతున్నారని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే ట్రాక్ కోసం, తాడిచెర్ల బ్లాక్ 2 సింగరేణికి దక్కేలా పార్లమెంట్‌‌‌‌లో కొట్లాడుతున్నామని చెప్పారు. 

రామగిరిలో టూరిజం డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం నిధులు తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో లీడర్లు భూపాలరావు, గోపాలరావు మెరుగు లక్ష్మణ్, శేఖర్, వంశీకృష్ణ అభిమాన సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు జాగిరి నగేశ్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాటారంలో బీసీ వెల్ఫేర్ అండ్ జూనియర్ కాలేజ్‌‌‌‌ను పరిశీలించి స్టూడెంట్స్ బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

 ఇటీవల మహదేవపూర్‌‌‌‌‌‌‌‌లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు పిల్లలకు ఎంపీ వంశీకృష్ణ ఆర్థిక సాయం చేశారు. వారిద్దరికి అండగా ఉంటానని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ టీం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జాగిరి నరేశ్‌‌‌‌ గౌడ్. బల్ల శ్రావణ్, పెండ్యాల ప్రవీణ్, పాండు పాల్గొన్నారు. 
 

శబరిమల రైళ్లకు అదనపు హాల్టింగ్‌‌‌‌లు ఇవ్వాలి


కోల్​బెల్ట్: శబరిమలై అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం పలు ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లకు బెల్లంపల్లి, మంచి ర్యాల, పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో అదనపు హాల్టింగ్‌‌‌‌లు కల్పించాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌కు వంశీ కృష్ణ లేఖ రాశారు.

 ఏటా మండల -మకరవిళక్కు పుణ్యకాలంలో బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తారు. వారి సౌకర్యం కోసం కేరళ ఎక్స్‌‌‌‌ప్రెస్, హిమసాగర్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లను బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి స్టేషన్లలో ఆపాలని కోరినట్టు చెప్పారు.

 కోర్బా-తిరువ నంత పురం నార్త్ సూపర్‌‌‌‌ఫాస్ట్ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైలుకు పెద్దపల్లి జంక్షన్‌‌‌‌లో అదనపు స్టాపేజీ కల్పించాలని కోరారు. ఈ మేరకు రైల్వే బోర్డు, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.