- ఆగస్టులోనే 597 మంది దుర్మరణం..
- నిరుటి కంటే పెరిగిన ప్రమాదాలు
- నేషనల్ హైవేలపై 658 బ్లాక్ స్పాట్లు
- కాగితాలకే పరిమితమైన రోడ్డు సేఫ్టీ
- లైసెన్స్ లేకున్నా బండి ఎక్కేస్తున్నరు..
- ఇప్పటి వరకు 25 వేల మందిపై కేసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని రోడ్డు భద్రతా నిబంధనలు తెస్తున్నా, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. రవాణా శాఖ అధికారిక రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం.. 2026లో ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 19,398 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 5,105 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18,174 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2025 ఏడాది మొత్తంలో 27,341 ప్రమాదాలు జరిగి 7,517 మంది చనిపోగా, 25,053 మంది క్షతగాత్రులయ్యారు.
నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2025 ఆగస్టులో 2,099 ప్రమాదాలు జరిగి 534 మంది చనిపోగా.. 2026 ఆగస్టు నాటికి ప్రమాదాలు 2,473కు, మరణాలు 597కు పెరిగాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 2,358 మంది గాయపడ్డారు. ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుతుండటం రవాణా, పోలీసు శాఖల పర్యవేక్షణ లోపాలను చూపుతోంది. రోజుకు సగటున 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం అవగాహన సదస్సులకే పరిమితం కాకుండా రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిచేయాలని, మద్యం తాగి వాహనాలు నడిపేవారు,
లైసెన్స్ లేనివారిపై చర్యలతో పాటు లైసెన్సుల రద్దును కఠినంగా అమలు చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
జాతీయ రహదారులపైనే ఎక్కువ బ్లాక్ స్పాట్లు..
రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో జాతీయ రహదారులే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్లలో ఇంజినీరింగ్ లోపాల వల్ల తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తారు. వీటి సంఖ్య జాతీయ రహదారులపై తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2023లో 979 బ్లాక్ స్పాట్లు ఉండగా, 2024లో 936, 2025 నాటికి 900కు తగ్గాయి.
రాష్ట్ర రహదారులపై 2023లో 136 ఉన్న బ్లాక్ స్పాట్లు 2025 నాటికి 93కు, ఇతర రోడ్లపై 173 నుంచి 149కి తగ్గాయి. కానీ జాతీయ రహదారులపై పరిస్థితి భిన్నంగా ఉంది. 2023లో ఎన్‌హెచ్‌లపై 670 బ్లాక్ స్పాట్లు ఉండగా, 2024లో 656కు తగ్గాయి. 2025 నాటికి మళ్లీ 658కి పెరిగాయి. మొత్తం బ్లాక్ స్పాట్లలో 73 శాతానికి పైగా జాతీయ రహదారులపైనే ఉన్నాయి. హైవేలపై వేగ నియంత్రణ లేకపోవడం, జంక్షన్ల వద్ద లోపభూయిష్టమైన డిజైన్లను సరిచేయడంలో నేషనల్ హైవేస్ అథారిటీ విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి.
లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్..
నిబంధనల అమలులో నిర్లక్ష్యానికి ఎన్ఫోర్స్మెంట్ నివేదికలోని గణాంకాలే నిదర్శనం. రాష్ట్రంలో సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వేలాది మంది వాహనాలు నడుపుతున్నట్లు కేసుల వివరాలు వెల్లడిస్తున్నాయి. 2025-–26 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి లైసెన్స్ లేనివారిపై 19,005 కేసులు నమోదు కాగా.. 2026-–27 సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 25,855కు పెరిగింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే లైసెన్స్ లేని 4,272 మందిపై కేసులు నమోదయ్యాయి.
మరోవైపు పరిమితికి మించి ప్రయాణికులను, సరుకులను తరలించే ఓవర్‌లోడ్ వాహనాలపై కూడా చర్యలు కొనసాగుతున్నాయి. 2025 సెప్టెంబర్ నాటికి 2,337 కేసులు నమోదు కాగా, 2026 సెప్టెంబర్ నాటికి 2,500కు చేరాయి. మైనర్లు, అనర్హులు వాహనాలు నడుపుతున్నా ముందస్తు తనిఖీలు చేపట్టకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. హెల్మెట్, సీట్‌బెల్ట్ నిబంధనల
అమలు కూడా నామమాత్రంగానే ఉంది.
సీట్‌బెల్ట్ ధరించని వారిపై 2025 సెప్టెంబర్ నాటికి 232 కేసులు నమోదు కాగా, 2026 నాటికి 256కు పెరిగాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారిపై 2026 సెప్టెంబర్ నాటికి 281 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాత్రివేళల్లో ప్రమాదాలను నివారించేందుకు ఉపయోగపడే రిఫ్లెక్టర్ల నిబంధన అమలులోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ట్రాలీలు, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలకు రిఫ్లెక్టర్లు లేకపోవడంపై 2025 సెప్టెంబర్ నాటికి 4,817 కేసులు నమోదు కాగా.. 2026 సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 517కు తగ్గింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు సరిగా చేయకపోవడం వల్లే కేసులు తగ్గాయన్న విమర్శలు ఉన్నాయి. ఇతర నిబంధనల ఉల్లంఘనలపై కేసులు 121 నుంచి 190కి పెరిగాయి.
ఆర్భాటానికే అవగాహన కార్యక్రమాలు..
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2026–-27 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 204 రోడ్డు భద్రతా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇందులో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 27 కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పాఠశాలలు, కళాశాలలు, కూడళ్లలో సదస్సులు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రమాదాలు తగ్గడం లేదు. నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాలను సరిచేస్తేనే రహదారులపై ప్రాణనష్టాన్ని అరికట్టే అవకాశం ఉంది.
74 శాతం తగ్గిన లైసెన్స్ సస్పెన్షన్లు..
ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. మద్యం తాగి వాహనాలు నడపడం, గూడ్స్ వాహనాల్లో ఓవర్లోడింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ చర్యలు భారీగా తగ్గాయి.
2025-–26లో సెప్టెంబర్ నాటికి 4,841 మంది డ్రైవింగ్ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేయగా.. 2026-–27 సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 1,255కు పడిపోయింది. అంటే దాదాపు 74 శాతం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 1,201 లైసెన్సులు రద్దు కాగా, ఈ ఏడాది అదే నెలలో కేవలం 400 మాత్రమే రద్దు చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినవారికి జరిమానాలు విధించి వదిలేస్తున్నారే తప్ప, లైసెన్సుల రద్దు విషయంలో వెనకడుగు వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
