పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్లు అందక, హాస్టళ్లలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ స్టూడెంట్స్ హాస్టల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నాయని ఆరోపించారు.
విద్యా సంవత్సరం మధ్యలో దిల్సుఖ్నగర్ ఎస్సీ మహిళా హాస్టల్ విద్యార్థినులను ఖాళీ చేయించి రోడ్డున పడేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థుల పౌష్టికాహారంలో కోత విధిస్తూ ఎల్‌నినో సాకులు చెబుతున్నారని విమర్శించారు. ఎస్సీ ప్రజాప్రతినిధులు సైతం విద్యార్థుల గోడును పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి, పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలని, మూసివేసిన హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని కోరారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.
