రైతులను ఆదుకోవడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

రైతులను ఆదుకోవడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 
  •     పంట నష్టపరిహారం వెంటనే ప్రకటించాలి
  •     సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

ఖమ్మం టౌన్, వెలుగు:  రాష్ట్రంలోని 360కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని 24 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినా రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌‌‌‌‌‌‌‌లో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరికి ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని, ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కరువు నివారణకు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల నిధులు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించి రోజుకు రూ.800 వేతనంతో ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని, రేషన్ కార్డులపై 10 కేజీల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని సూచించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలుతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతం చేయాలన్నారు. 

లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మిక సంఘాలు డిసెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించే ‘చలో ఢిల్లీ’కి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో వివక్ష చూపుతోందని, ‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ఈ నెల 26న చేపట్టే నిరసనలకు మద్దతు ప్రకటించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించగల శక్తులకు మద్దతు ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, నేతలు పి.వీరారెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జహంగీర్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి విక్రమ్ పాల్గొన్నారు.