- కరీంనగర్ ఫిలిం భవన్‌లో నిర్మాత పొన్నం రవిచంద్ర
హైదరాబాద్, వెలుగు: భారత సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ (తెలుగు డబ్బింగ్) సినిమాను ప్రజలంతా ఆదరించి విజయవంతం చేయాలని నిర్మాత పొన్నం రవిచంద్ర కోరారు. ఆదివారం కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న తెలంగాణవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
మహిళలు, దళితులు, బహుజనులు, విద్యార్థులు ఫూలే జీవితాన్ని, పోరాటాన్ని తెలుసుకునేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందన్నారు. ఆనాటి కాలంలో పుట్టుక ఆధారంగా మనుషులను అణచివేసిన తీరు, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన పోరాటం, మహిళలకు విద్యను అందించిన చరిత్రను ఇందులో చూపించామన్నారు. చిత్రంలో మూడు పాటలు ఉన్నాయని, కథాకథనం ఆసక్తికరంగా సాగుతుందని చెప్పారు.
