హైదరాబాద్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఆదివారం నూతన ప్రాంతీయ వ్యాపార కార్యాలయానికి(ఆర్బీవో) శంకుస్థాపన చేశారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు సామాజిక బాధ్యత(సీఎస్సార్) కార్యక్రమాలను ప్రారంభించారు. 2028 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 110 పరిపాలనా కార్యాలయాలను సొంత భవనాల్లోకి మారుస్తామని, జోగులాంబ ప్రాంగణంలోనే మోడల్ బ్రాంచ్, అగ్రి-ఎంఎస్ఎంఈ క్రెడిట్ సెంటర్, హోమ్ లోన్ సెంటర్ పనిచేస్తాయన్నారు.
వరుసగా రెండో ఏడాది ప్రపంచపు అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంక్ గుర్తింపు రావడం, యోనో యాప్ 10 కోట్ల వినియోగదారులను దాటడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 60 అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వనపర్తి జిల్లా పెబ్బేరు జెడ్పీహెచ్ఎస్కు కంప్యూటర్లు, లంచ్ షెడ్, ఆర్వో ప్లాంట్, వనపర్తి సరస్వతి శిశు మందిర్కు ఇంటరాక్టివ్ ప్యానెల్స్, ఆర్వో వాటర్, సోలార్ సిస్టమ్ అందజేశారు. నాగర్కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 30 కంప్యూటర్లు, 5 ప్రొజెక్టర్లు, విద్యార్థినులకు 50 సైకిళ్ల పంపిణీ చేశారు. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి డిజిటల్ కియోస్క్, ఈ-బగ్గీ అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ సర్కిల్ సీజీఎం నీలేశ్ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
