శ్రీశైలం: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించే కార్తీక సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది.
భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు దీపారాధనలు నిర్వహించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.
స్పర్శ దర్శనాలు నిలిపివేత
కార్తీక మాసంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాలు, సోమవారాల్లో స్పర్శ దర్శనాలు, సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలను నెల రోజుల పాటు నిలిపివేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు నాలుగు విడతల్లో స్పర్శ దర్శనానికి అనుమతించనున్నారు.
సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
నేడు లక్షదీపోత్సవం
కార్తీక రెండో సోమవారం సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రధానాలయం ఈశాన్య భాగంలోని ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
ఆదివారం ఒక్కరోజే 43,247 మంది భక్తులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. కార్తీక మాసం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ఇతర సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
