- చొరబాటుదారులకు ఓట్లు కావాలని కోరుకునే వాళ్లంతా మూర్ఖులే
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అడ్డుకునే వారంతా దేశద్రోహులేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కావాలని కోరుకునేవారు తన దృష్టిలో మూర్ఖులేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌లోని గురుద్వారాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన11 కేవీ సోలార్ ప్యానెల్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..18 ఏండ్లు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడం, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారివి తొలగించడం, మరణించిన వారి పేర్లతో పాటు అక్రమంగా చొరబడిన విదేశీయుల ఓట్లను జాబితా నుంచి తీసివేయడమే సర్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు బీజేపీ అసలు పోటీయే కాదని, బీఆర్ఎస్‌తోనే తమ పోటీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, తమ పార్టీని తట్టుకునే దమ్ము, శక్తి కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని సంజయ్ ఆరోపించారు.
